ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్.. దేశంలోని ప్రతి ఒక్కరూ తమ ముందు తలవంచి నిల్చోవాలని భావిస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. తమిళనాడు శాసనసభ ఎన్నికల నేపథ్యంలో.. చెన్నైలో ప్రచారం నిర్వహించారు. అంతా తమ ముందు తలవంచాలనే సిద్ధాంతాన్ని వారు నమ్మితే.. సోదరభావం, పరస్పర గౌరవం అనే సిద్ధాంతాన్ని తాము నమ్ముతామని తెలిపారు. ఎంతో ఘనత కలిగిన తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి పళనిస్వామి.. ప్రధాని ముందు తలవంచి, ఆయన పాదాలకు నమస్కరిస్తున్నాని రాహుల్ గాంధీ విమర్శించారు. అవినీతిలో కూరుకుపోయినందునే పళనిస్వామి.. ప్రధానికి లొంగిపోయారని ఆరోపించారు.
"భారతదేశంలో రెండు సిద్ధాంతాలు ఉన్నాయి. అందరూ తమ ముందు తలవంచాలని ఒక సిద్ధాంతం చెబుతుంది. ఆ సిద్ధాంతాన్నే ఆర్.ఎస్.ఎస్, నరేంద్ర మోదీ, అమిత్ షా నమ్ముతారు. సోదరభావం, సమానత్వం, పరస్పర గౌరవంతో కూడినది మరో సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని మేం నమ్ముతాం. ఎంతో నాగరికత, గొప్ప భాష, సంస్కృతి కలిగిన తమిళనాడు రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి.. నరేంద్ర మోదీ పాదాలను తాకడం, అమిత్ షా, ఆర్.ఎస్.ఎస్ ముందు తలవంచడాన్ని భరించడం నాకు సమస్యగా మారింది. తమిళనాడు ముఖ్యమంత్రిని నియంత్రించడం, ఆయన తన కాళ్లను తాకేలా చేయడాన్ని అంగీకరించేందుకు నేను సిద్ధంగా లేను. అవినీతికి పాల్పడి ముఖ్యమంత్రి తన స్వేచ్ఛను కోల్పోయారు."
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
ఇదీ చూడండి: 'బంగాల్, అసోం తొలి విడతలో భాజపాకే పట్టం'