ప్రధాని నరేంద్ర మోదీ సహా తనను బయటి వ్యక్తిగా మమతా బెనర్జీ అభివర్ణించడాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా ఖండించారు. దీదీకి సరైన జ్ఞానం లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, టీఎంసీ, వామపక్షాలే బయటి వ్యక్తులపై ఆధారపడ్డాయని ఎదురుదాడికి దిగారు. బంగాల్ జల్పైగుడి జిల్లాలోని దోఆర్ ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీకి హాజరైన ఆయన.. దీదీపై విమర్శలకు పదునుపెట్టారు.
"నేను బయటి వ్యక్తినా? నేను భారత పౌరుడిని కాదా? దేశ ప్రధానినే బయటి వ్యక్తి అని మమతా బెనర్జీ అంటున్నారు. దీదీ.. బయటివారు ఎవరో నేను చెబుతాను. చైనా, రష్యా నుంచి భావజాలాన్ని దిగుమతి చేసుకున్న కమ్యూనిస్టులు బయటివారు. ఇటలీ నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకత్వం కూడా బయటిదే. తృణమూల్ కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తం.. బయటివారైన చట్టవ్యతిరేక వలసదారులపైనే ఆధారపడి ఉంది."
-అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
బంగాల్ కోసం మోదీ 115 స్కీమ్‌లు(పథకాలు) ప్రకటిస్తే.. దీదీ 115 స్కాంలు ఇచ్చారని అమిత్ షా ఆరోపించారు. ఇకముందు రాష్ట్ర ప్రజలను దీదీ మోసం చేసే అవకాశం లేదని పేర్కొన్నారు. త్వరలోనే బంగాల్‌కు ఇక్కడి గడ్డమీద పుట్టిన బిడ్డ సీఎంగా రానున్నారని చెప్పారు.
గూర్ఖాల సమస్య పరిష్కరిస్తాం
అంతకుముందు డార్జీలింగ్లో మాట్లాడిన షా.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత బంగాల్ కొండ ప్రాంతాల్లోని గూర్ఖాల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దేశ రాజ్యాంగం విస్తారమైనదని.. అన్ని సమస్యల పరిష్కారానికి అది ఉపయోగపడుతుందని చెప్పారు. ఎన్ఆర్సీ అమలు చేసే ప్రణాళికలు ఏవీ లేవని.. ఒకవేళ చేసినా గూర్ఖాలు భయపడాల్సిన అవసరం లేదని మరోసారి భరోసా ఇచ్చారు.
ఓడిపోయిన ఆటగాడిలా దీదీ: నడ్డా
మరోవైపు, మమతా బెనర్జీ దుస్థితి ఓడిపోయిన ఆటగాడిలా ఉందని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. తూర్పు బర్ధమాన్ జిల్లాలో రోడ్‌షో నిర్వహించిన ఆయన... దీదీ లక్ష్యంగా విమర్శలకు దిగారు. పదేపదే ఎన్నికల సంఘాన్ని, భాజపాను వేలెత్తి చూపిస్తూ.. ప్రజలకు ఉపయోగపడే పనులు చేయలేదనే విషయాన్ని దీదీ మరిచిపోయారని అన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి రాష్ట్ర ప్రజలకు దీదీ అన్యాయం చేస్తూ వస్తున్నారని ఆరోపించారు. బుజ్జగింపు రాజకీయాలు, నియంతృత్వం, దోపిడీ, లంచగొండితనం సంస్కృతులు రాష్ట్రాన్ని నాశనం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: బంగాల్ భాజపా ఎంపీపై ఈసీ ఆంక్షలు