Tirumala Vaikuntha Dwara Sarvadarshan Tickets Distribution: కలియుగ వైకుంఠనాథుడు తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి మొదలు పది రోజుల పాటు వైకుంఠ ద్వారప్రవేశానికి టీటీడీ చర్యలు చేపట్టింది. ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న వైకుంఠ ద్వార సర్వ దర్శనం టికెట్ల జారీ టీటీడీ నిర్దేశించిన సమయం కంటే ముందుగానే ప్రారంభమైంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేలాది మంది భక్తులు గురువారం సాయంత్రానికే తిరుపతి చేరుకున్నారు. వైకుంఠ ద్వార ప్రవేశాల కోసం తిరుపతిలో 9 కేంద్రాలను టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు.
తిరుమలగిరుల్లొ మంచు సోయగం - కనువిందుగా దైవ దర్శనం
ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు జారీ ప్రారంభించనున్నట్లు తొలుత అధికారులు ప్రకటించారు. కాగా గురువారం సాయంత్రానికే టోకెన్ల జారీ కేంద్రాల వద్ద భక్తులు భారీగా మోహరించడంతో వారిని అదుపు చేయడం టీటీడీ, పోలీస్ సిబ్బంది వల్ల కాలేదు. భక్తులను అదుపు చేయడంలో విఫలం కావడంతో గురువారం అర్ధరాత్రి నుంచే టోకెన్ల జారీ ప్రారంభించారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల కోసం ప్రత్యేక రంగుల్లో ముద్రించిన టికెట్లను ఇస్తున్నారు.
తిరుమల గిరిలో సరికొత్త శోభ - కనువిందు చేస్తున్న కపిలతీర్థం
10 రోజుల పాటు రోజుకు 80 వేల మంది శ్రీవారిని దర్శించుకొనేందుకు వీలుగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. రోజుకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా 25 వేల మంది సర్వదర్శనం ద్వారా 42 వేల మంది శ్రీవాణి ట్రస్ట్‌కు విరాళాలు ఇచ్చిన భక్తులు 2 వేల మందితో పాటు సిఫార్సు లేఖలతో మరి కొంత మందికి దర్శనాలు కల్పించనుంది. పది రోజుల పాటు 2 లక్షల 50 వేల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్ ద్వారా విడుదల చేసిన టీటీడీ మరో 4 లక్షల 20 వేల సర్వదర్శన టికెట్లను తిరుపతిలో జారీ చేయనుంది. సర్వదర్శనం టికెట్లను జారీ చేయడానికి తిరుపతిలోని తొమ్మిది ప్రాంతాల్లో 92 కౌంటర్లు ఏర్పాటు చేశారు.
తిరుమలలో ఎడతెరిపి లేని జల్లులు - తీవ్రమైన చలి కారణంగా భక్తులు ఇబ్బందులు
తిరుపతిలో భూదేవి కాంప్లెక్స్, ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, జీవకోన జడ్పీ ఉన్నత పాఠశాల, విష్ణునివాసం, శ్రీనివాసం, బైరాగి పట్టెడలోని రామానాయుడు పాఠశాల, శేషాద్రి నగర్‌లోని జెడ్పీ ఉన్నత పాఠశాల, గోవిందరాజ స్వామి సత్రాల వద్ద పది రోజుల పాటు టోకెన్లను జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. తిరుపతిలోని తొమ్మిది ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సర్వదర్శనం కౌంటర్లకు భక్తులు సులువుగా వెళ్లేందుకు వీలుగా ప్రత్యేక సమాచార కేంద్రాలు, క్యూఆర్ స్కాన్ లను ఏర్పాటు చేసి తగిన సూచనలు చేసేందుకు సిబ్బందిని నియమించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.