కరోనా రెండో దశ దేశాన్ని కుదిపేస్తున్న వేళ.. పౌర యంత్రాంగానికి సైనిక దళాలు సహకారం అందించాల్సిన సమయం ఆసన్నమైందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ పేర్కొన్నారు. కొవిడ్ నియంత్రణ కోసం కావాల్సిన ఏర్పాట్లను త్వరితగతిన సిద్ధం చేసేందుకు సైన్యం సహకారం అందించాలని అన్నారు.
"సాయుధ దళాలు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పనిచేయాల్సిన సందర్భమిది. కరోనా నియంత్రణ చర్యల కోసం అధికార యంత్రాంగానికి సహకారం అందించడం చాలా ముఖ్యం. యూనిఫాంలో ఉండే మా సిబ్బంది అడ్డంకులను ఎదిరించి.. అంకితభావంతో పనిచేస్తారు. అదనపు దూరం నడిచేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు."
-జనరల్ బిపిన్ రావత్, సీడీఎస్
జనరల్ రావత్‌తో ప్రధాని మోదీ సోమవారమే సమావేశమయ్యారు. కరోనా కట్టడి విషయంలో సాయుధ దళాల సన్నద్ధతను ప్రధాని సమీక్షించారు. సాయుధ దళాలకు చెందిన విశ్రాంత వైద్యులు, వైద్య సిబ్బందిని కరోనా నియంత్రణ చర్యల కోసం వినియోగించుకునే ఏర్పాట్లు చేస్తున్నట్లు జనరల్ రావత్.. ప్రధానికి వివరించారు. గత రెండేళ్లలో ముందస్తు పదవీ విరమణ చేసినవారిని ఇందుకోసం పిలుస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి- థాయ్ నుంచి భారత్‌కు ఆక్సిజన్ కంటైనర్లు