మయన్మార్లో కొనసాగుతున్న సైనిక పాలనను అక్కడి ప్రజలే కాకుండా పోలీసులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ ఆందోళన చేస్తున్న వారిపై సైన్యం దారుణ అణచివేతకు పాల్పడుతోంది. దీంతో ప్రజలే కాకుండా సైనిక ఆజ్ఞలను పాటించలేని పోలీసులు కూడా భారత్‌కు వచ్చి తలదాచుకునే పరిస్థితి ఏర్పడింది. తాజాగా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన మయన్మార్ పోలీసులు, ఇక్కడ ఆశ్రయం కోరినట్లు భారత అధికారులు వెల్లడించారు. రానున్న రోజుల్లో ఇలా వచ్చే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నామన్నారు.
మయన్మార్‌లో సైనిక పాలనకు వ్యతిరేకంగా పోరాడడంతో పాటు ఆంగ్ సాన్ సూకీని విడుదల చేయాలని మయన్మార్‌లో ఆమె మద్దతుదారులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. సైనిక పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ఇప్పటివరకు దాదాపు 50 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఈ నిరసనలకు ప్రజలతో పాటు కొంతమంది పోలీసులు కూడా మద్దతు తెలుపుతున్నారు. ఇక సైన్యం హింసను భరించలేని కొందరు భారత్ సరిహద్దుల ద్వారా దేశంలోకి చొరబడి ఇక్కడ తలదాచుకుంటున్న ఘటనలు ఈ మధ్య వెలుగులోకి వచ్చాయి. అక్కడి సైన్యం ఆదేశాలను అమలు చేయలేని పోలీసులపైనా సైన్యం ఉక్కుపాదం మోపుతోంది. దీంతో సైనిక చర్యకు బయపడుతున్న కొందరు పోలీసులు, భారత్‌లోకి ప్రవేశించి తలదాచుకున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి.
ఇలా ఇప్పటివరకు 19మంది మయన్మార్ పోలీసులు మిజోరాం సరిహద్దుల ద్వారా దేశంలోకి ప్రవేశించినట్లు గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న భారత అధికారులు, వారి ఆరోగ్యాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే మయన్మార్ నుంచి భారత్‌కు వచ్చిన వేల మంది ఇక్కడ ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. అయితే, అక్కడి పోలీసులే పారిపోయి వచ్చి ఆశ్రయం పొందడం మాత్రం అరుదైన విషయమని భారత అధికారులతో పాటు రిఫ్యూజీ కమిటీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.