Three Capitals Effect on YSRCP in Amaravati: రాజధాని అమరావతి ప్రాంతంలో అధికార వైఎస్సార్సీపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని వైఎస్సార్సీపీ సస్పెండ్ చేయగా ఆమె ఇటీవల టీడీపీలో చేరారు. తాడికొండలో ఏడాది కాలంలో ముగ్గురు ఇంఛార్జీలను మార్చి ఇటీవల ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరితకు బాధ్యతలు అప్పజెప్పారు. ఇక మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్సార్సీపీకి రాంరాం చెప్పి వేరేదారి వెతుక్కునే పనిలో పడ్డారు. 3 రాజధానుల ప్రకటన చేసి అమరావతిని అంతం చేయాలని ప్రయత్నాలు చేస్తున్న వైఎస్సార్సీపీ తాజా పరిణామాలతో గందరగోళంలో పడింది.
తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో విప్ ఉల్లంఘించారన్న నెపంతో వైఎస్సార్సీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఆమె లోకేశ్ పాదయాత్రలో పాల్గొని అమరావతిపై జగన్ ప్రభుత్వ కుట్రల్ని బహిర్గతం చేశారు. జగన్ నిరంకుశ ధోరణి, రాజధాని విషయంలో ఎలా మోసం చేశారనే అంశాలను ప్రజలకు వివరించారు. ఆపద సమయంలో తనను గెలిపించిన ప్రజలకు అండగా నిలవలేకపోయానని బహిరంగ క్షమాపణ చెప్పారు.
ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను తాడికొండ వైఎస్సార్సీపీ ఇంఛార్జిగా చేశారు. నెల లోపే ఆయనను తప్పించి కత్తెర సురేశ్ కుమార్‌కు బాధ్యతలు అప్పజెప్పారు. ఇటీవల కత్తెర సురేశ్‌ను తప్పించి ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరితను సమన్వయకర్తగా నియమించారు. ఈ పరిణామాలపై సామాజిక బస్సు యాత్ర వేదికగా డొక్కా మాణిక్య వరప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
కాపు ఓట్లు జారిపోకుండా వైఎస్సార్సీపీ వ్యూహం - వంగవీటి రాధ, ముద్రగడకు పార్టీలోకి ఆహ్వానం
జగన్‌ను కలిసే అవకాశం ఇప్పించాలని ముఖ్య నేతలను అభ్యర్థించాల్సిన స్థాయికి పడిపోయారు. కత్తెర సురేశ్ సైతం కక్కలేక మింగలేక అన్నట్లు ఉన్నారు. మంగళగిరిలో వైఎస్సార్సీపీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 2019 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత 3రాజధానుల బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెడితే దానికి మద్దతుగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడారు. అమరావతికి భూములు ఇచ్చిన రైతులు త్యాగాలు చేయలేదని వ్యాఖ్యానించి వారి మనోభావాలను గాయపరిచారు.
రాజధాని రైతులు పోరాటం చేస్తున్న సమయంలోనూ వారిని కించపరిచేలా మాట్లాడారు. నాలుగేళ్ల తర్వాత కథ అడ్డం తిరిగింది. రాజకీయంగా ప్రతికూల పరిస్థితులు ఎదురుకావడంతో వైఎస్సార్సీపీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రజలకు న్యాయం చేయలేకపోయానని ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారు. మంగళగిరికి గంజి చిరంజీవిని సమన్వయకర్తగా ప్రకటించినా ఆళ్ల రూపంలో కొత్త సమస్యను ఎదుర్కొవాల్సి వచ్చింది. తాను మంగళగిరి ప్రజలకు అండగా ఉంటానని ఆర్కే ప్రకటించడంతో రాజకీయం మరింత ముదిరింది.
2014, 2019లో ఇక్కడ వైఎస్సార్సీపీ విజయం సాధించగా ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ నియోజకవర్గంలో కార్యకలాపాలు వేగవంతం చేశారు. నియోజకవర్గంలో సొంత నిధులు వెచ్చించి పనులు చేస్తున్నారు. ఇలా అనేక పనులు టీడీపీ గ్రాఫ్ పెంచగా వైఎస్సార్సీపీని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టేశాయి.