ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హత్య చేస్తానంటూ ఈ-మెయిల్ బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు నిఘా వర్గాలకు ఓ ఈ-మెయిల్ అందింది. 20కిలోల ఆర్డీఎక్స్ తన వద్ద ఉందని ఈ-మెయిల్‌లో ఆగంతకుడు పేర్కొన్నాడు. కోట్లాదిమందిని హత్య చేసేందుకు పథకం రచించినట్లు వెల్లడించాడు. దేశవ్యాప్తంగా 20ప్రాంతాల్లో దాడులకు పథకం వేసినట్లు పేర్కొన్న ఆగంతకుడు 2 కోట్ల మందిని చంపాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్లు ఈ-మెయిల్‌లో తెలిపాడు. వీలైనంత త్వరగా ప్రధాని మోదీని హత్య చేస్తానని ప్రకటించాడు.
ఆర్డీఎక్స్ దాడులకు సంబంధించి కొంతమంది ఉగ్రవాదులు తనకు సహకరిస్తున్నట్లు తెలిపాడు. ఇప్పటికే ప్రధాన నగరాల్లో బాంబులు పెట్టినట్లు ఆగంతకుడు పేర్కొన్నాడు. 20స్లీపర్ సెల్స్ యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపాడు. ప్రధాని మోదీకి బెదిరింపు ఈ-మెయిల్ ఘటనపై దర్యాప్తు సంస్థలు అప్రమత్తమయ్యాయి. బెదిరింపు ఈ-మెయిల్ ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టడటంతోపాటు ప్రధాని మోదీ భద్రతను కట్టుదిట్టం చేశాయి.