పలు రాష్ట్రాలు కొవిడ్ ఆంక్షలు సడలించిన నేపథ్యంలో పర్యాటక ప్రదేశాల్లో జనాలు సేదతీరుతున్న దృశ్యాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. మూడో ముప్పు పొంచి ఉన్న వేళ.. ఈ దృశ్యాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, నిపుణులను ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి, ఉత్తరాఖండ్‌లోని కెమ్టీ జలపాతం.. ఇప్పుడు హరిద్వార్‌లోని హర్ కీ పౌరీ ఘాట్ వద్ద జనాలు సమూహాలుగా దర్శనమిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన భక్తులు గంగానది ఒడ్డున ఉన్న ఈ ఘాట్ వద్ద నదీస్నానం చేస్తున్నారు.
హైకోర్టు గరం!
ఇప్పటికే కొవిడ్ నియమాల ఉల్లంఘనలను నైనిటాల్ హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. లాక్‌డౌన్ ఆంక్షల సడలింపులను మరోసారి సమీక్షించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పర్యాటకుల ద్వారా ప్రమాదకరమైన డెల్టా ప్లస్ వేరియంట్ రాష్ట్రంలో ప్రవేశిస్తుందని హెచ్చరించింది.
వారిని చూసైనా..
ఇదిలా ఉండగా.. ప్రజలు ఆంక్షలను పట్టించుకోకపోవడంపై కేంద్రం ఇప్పటికే తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. యూరో ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ కారణంగా బ్రిటన్‌లో కేసులు పెరుగుతున్న విషయాన్ని గుర్తుచేసింది. అలాగే బంగ్లాదేశ్‌లో రెండో దశ కంటే మూడోదశలో కేసులు పెరిగిన విషయాన్ని ప్రస్తావించింది. రష్యా, దక్షిణ కొరియా, ఇండొనేసియాలో మరోసారి కేసులు పెరుగుతున్నాయని తెలిపింది. కొవిడ్ ముప్పు తొలగిపోయిందనే భ్రమలో ఉండొద్దని హెచ్చరించింది.
కలవరపెడుతున్న కొత్త రకాలు..
డెల్టా రూపాంతరం చెంది డెల్టాప్లస్‌గా మారింది. ఇప్పుడు ఉత్తర్‌ప్రదేశ్‌లో కప్పా వేరియంట్ వెలుగుచూసింది. ఈ రెండు వేరియంట్లు కూడా బి.1.617 వర్గానికి చెందినవే. ఈ రెండింటిని మొదట భారత్‌లోనే గుర్తించారు. త్రిపురలో డెల్టాప్లస్ తీవ్రంగా విజృంభిస్తోంది. 150 నమూనాలను పరీక్షించగా.. 90కి పైగా కేసులు ఆ రకానివే. ఆ రాష్ట్రంలో కొత్త కేసుల్లో 60 శాతం కేసులకు ఇదే కారణమని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
కొవిడ్ ముగిసిపోలేదు: హిమాచల్ సీఎం..
ఇటీవల పర్యాటక ప్రాంతమైన మనాలికి పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. 'పర్యాటకులు రాష్ట్రానికి భారీగా తరలిరావడం ఆందోళన కలిగిస్తోంది. మా రాష్టానికి వారు ఎప్పుడైనా రావొచ్చు కానీ.. ప్రతి ఒక్కరు కొవిడ్ నియమాలు పాటించాలి. ఇంకా వైరస్ మన మధ్య నుంచి పోలేదు' అని హిమాచల్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ ఆందోళన వ్యక్తం చేశారు.
మరోపక్క హర్ కీ పౌరీ ఘాట్ వద్ద గంగానది స్నానం చేస్తున్న భక్తులు కొవిడ్ గురించి పెద్దగా ఆందోళన చెందడం లేదు. 'రెండేళ్ల తర్వాత జైలు నుంచి బయటపడినట్లు అనిపిస్తోంది. భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. మాకు కొవిడ్ గురించి భయం లేదు. మూడో ముప్పు కంటే ముందుగానే మేం ఇక్కడికి వచ్చాం కదా' అని కొందరు మీడియాతో అంటున్నారు.
ఇదీ చదవండి: మళ్లీ పెరుగుతున్న కేసులు- మూడో ముప్పు తప్పదా?