అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్రలో దిశా రవి భాగమయ్యారని పోలీసులు.. దిల్లీ కోర్టుకు తెలిపారు. రైతు నిరసనల మాటున దేశంలో అశాంతి సృష్టించాలని యత్నించారని చెప్పారు. వాట్సాప్ చాటింగ్‌లను దిశ డిలీట్ చేశారని, న్యాయపరమైన చిక్కుల గురించి ఆమెకు ముందే తెలుసని అన్నారు. దీన్ని బట్టి చూస్తే టూల్‌కిట్ వ్యవహారం వెనక దురుద్దేశం ఉందని వివరించారు. దిశ బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపడుతున్న దిల్లీ పాటియాలా హౌస్ కోర్టుకు ఈ మేరకు వివరాలను అందించారు.
"ఇది టూల్‌కిట్ మాత్రమే కాదు. భారత్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు, దేశంలో అశాంతి సృష్టించేందుకు జరిగిన ప్రణాళిక. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఈ కుట్రలో దిశ.. భారత్ తరపున భాగస్వామి. ఖలిస్థాన్ అనుకూలవాదులతో దిశా రవి సంప్రదింపులు జరిపారు. టూల్‌కిట్‌ను వారితో పంచుకున్నారు. ఏ తప్పు చేయకపోతే ఆధారాలను దిశ ఎందుకు డిలీట్ చేసినట్టు? ఇది ఆమె చేసిన తప్పును, ప్రణాళికను ధ్రువీకరిస్తోంది." అని పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఆధారాల్లేవ్..
కాగా, పోలీసుల ఆరోపణలను దిశా రవి తరపున హాజరైన న్యాయవాదులు తప్పుబట్టారు. దిశ నిందితురాలు కాదని, ఆమె పోరాటంలో పర్యావరణ, వ్యవసాయపరమైన కారణం ఉందని చెప్పారు. నిషేధిత సంస్థ 'సిక్ ఫర్ జస్టిస్'తో దిశకు సంబంధం ఉందనేందుకు ఎలాంటి ఆధారాల్లేవని చెప్పారు.
"రైతుల నిరసనలను అంతర్జాతీయ స్థాయిలో వెలుగులోకి తీసుకురావడం దేశద్రోహమే అయితే నేను(దిశ) జైలులో ఉండటమే మేలు. టూల్‌కిట్ వల్ల ప్రేరణ పొందానని చెప్పిన ఏ ఒక్క వ్యక్తినీ ఎర్రకోట ఘటనలో అరెస్టు చేయలేదు. రైతుల ర్యాలీలో హింసకు టూల్‌కిట్టే కారణమని చెప్పేందుకూ ఎలాంటి ఆధారాలు లేవు. ఒకవేళ నేను ఎవరినైనా కలిసినా.. వారిపై వేర్పాటువాది అనే గుర్తు ఉండదు కదా" అని దిశ తరపున న్యాయవాది కోర్టుకు విన్నవించారు.
ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. దిశ బెయిల్ పిటిషన్‌పై తీర్పును మంగళవారానికి వాయిదా వేసింది.
ఇవీ చదవండి: