కేరళలోని భాజపా నాయకుల మధ్య ఐక్యత, సామరస్యం లేదని మెట్రోమ్యాన్ శ్రీధరన్ ఆరోపించారు. దేశాన్ని పాలించే పార్టీలో విబేధాలు ఉండవద్దన్నారు. త్వరలో భాజపాలో చేరనున్న నేపథ్యంలో 'ఈటీవీ భారత్'కు ఇచ్చిన ఇంటర్వూలో కీలక వ్యాఖ్యలు చేశారు. హిందుత్వ అజెండాతో భాజపా ముందుకెళ్లటం సరైనది కాదన్నారు. దేశం ప్రగతి పథంలో నడవాలంటే.. అన్ని వర్గాల ప్రజలు ఐక్యతతో ముందుకెళ్లాలన్నారు. అయితే దేశానికి సేవ చేయటం భాజాపా లక్షణం అన్నారు. ఆ పార్టీలో అవినీతి లేదన్నారు.
కేరళలో హిందువుల మెజారిటీ ఎక్కువగా ఉన్నా.. మిగతా మతాల ప్రజలు సైతం ఉన్నారని వివరించారు. కేరళలో అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసేందుకు తాను కట్టుబడి ఉన్నానన్నారు.
అయితే.. భాజపాను హిందుత్వ కమ్యూనల్ పార్టీగా ముద్రించటం సరికాదన్నారు. కే. సురేంద్రన్.. కేరళ భాజపా అధ్యక్షుడు అయిన తర్వాత తన దగ్గరకు వచ్చారని.. అంతకుముందు ఎవరూ తనను సంప్రదించలేదని తెలిపారు.
తాను రాజకీయ నాయకుడిగా కాకుండా ప్రజా సేవకుడిగా ఉంటానని స్పష్టం చేశారు. ప్రజలకు మంచి చేసేందుకు రాజకీయాలను ఉపయోగించుకుంటానన్నారు. తన ఇంటికి దగ్గరగా ఉన్న నియోజకవర్గాల్లోనే పోటీ చేస్తానన్నారు. పాలక్కాడ్, త్రిస్సూర్, మలప్పురం.. నుంచి పోటీ చేయటానికి తాను రెడీ అన్నారు. కేరళకు మరిన్ని పరిశ్రమలు రావాలని ఆకాంక్షించారు.
"చాలా ఏళ్లు కేరళను ఎల్డీఎఫ్, యూడీఎఫ్‌లు పాలించాయి. వారి ప్రభుత్వ కాలంలో కేరళ అభివృద్ధికి నోచుకోలేదు. అన్ని వర్గాల ప్రజలు దీనస్థితిలోకి వెళ్లారు. 20ఏళ్లుగా కేరళకు ఒక్క పరిశ్రమ రాలేదు. ఇరు ప్రభుత్వాలు చాలా కుంభకోణాలకు పాల్పడ్డాయి."
--- ఈ. శ్రీధరన్, మెట్రోమ్యాన్
దేశభక్తి, దేశానికి సేవచేయటం భాజపా లక్షణం అన్నారు. భాజపాలో అవినీతి లేదన్నారు. ఒమెన్ చాందీతో తనకు సత్సంబంధాలు ఉన్నాయి.. కానీ పినరయి విజయన్‌తో పరిచయం లేదన్నారు.
వాళ్లు రైతులు కాదు
జాతి భద్రతకు పౌరసత్వ చట్టం(సీఏఏ) అవసరం ఎంతైనా ఉందన్నారు. రైతులు అనవసరంగా ఉద్యమం చేస్తున్నారని శ్రీధరన్ అభిప్రాయపడ్డారు. దిల్లీ సరిహద్దులో ఆందోళనలు చేస్తున్న వాళ్లు రైతులు కాదని ఆరోపించారు. శబరిమల సమస్య మరోసారి ప్రభుత్వానికి తలనొప్పిగా మారనుందన్నారు.
ఇదీ చదవండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే, ముగ్గురు కొడుకులకు ఏడాది జైలు