తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం కుమారుడు, లోక్‌సభ ఎంపీ రవీంద్రనాథ్ ఎన్నిక చెల్లదని మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది. థేనీ పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన ఓ ఓటరు వేసిన ఫిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ ఎస్ ఎస్ సుందర్ ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఎంపీగా రవీంద్రనాథ్ ఎన్నిక చెల్లదని స్పష్టం చేశారు. అయితే.. సుప్రీంకోర్టులో సవాలు చేసుకునేందుకు వీలుగా.. ఈ తీర్పు అమలును నెల రోజులు వాయిదా వేశారు.
ఇదీ జరిగింది..
థేనీ నియోజకవర్గానికి చెందిన ఓటర్ మిలానీ.. రవీంద్రనాథ్ ఎన్నిక చెల్లదంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2019 ఎన్నికల అఫిడవిట్లో రవీంద్రనాథ్ తన ఆస్తుల వివరాలు తప్పుగా చూపారని మిలానీ ఆరోపించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది అరుణ్ కుమార్.. ఎంపీ నామినేషన్లో అనేక విషయాలను పొందుపర్చలేరని కోర్టుకు తెలిపారు. వాస్తవాలను తెలపకపోవడం ఎన్నికపై ప్రభావం చూపిందంటూ.. ఆరోపణలకు బలం చేకూర్చే ఆధారాలను కోర్టుకు సమర్పించామని అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. పిటిషన్‌ను పరిశీలించి విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ సుందర్.. ఎంపీ ఎన్నిక చెల్లదని గురువారం తీర్పునిచ్చారు.
లోక్‌సభ స్పీకర్‌కు లేఖ..
కోర్టు తీర్పు తర్వాత.. రవీంద్రనాథ్ ఇక నుంచి అన్నాడీఎంకేతో లేరని, ఆయనను తమ పార్టీకి సంబంధించిన ఎంపీగా చూడరాదని పళనిస్వామి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
థేనీ పార్లమెంట్ నుంచి 2019 ఎన్నికల్లో అన్నాడీఎంకే తరఫున పోటీ చేసి లోక్‌సభ సభ్యుడిగా గెలిచారు రవీంద్రనాథ్. అయితే గతేడాది జులైలో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన పళనిస్వామి.. ప్రత్యర్థి వర్గంలోని పన్నీర్‌సెల్వం, రవీంద్రనాథ్ సహా మరికొందరిని పార్టీ నుంచి బహిష్కరించారు.
ఇటీవలె మంత్రి భర్తరఫ్..!
తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవి.. గతనెల బర్తరఫ్ చేసి 24 గంటల్లోగా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం వివాదాస్పదమైంది. ఉద్యోగాలు అమ్ముకున్నట్లు ఆయనపై ఆరోపణలున్నాయని రాజ్‌భవన్ వెల్లడించింది. కాగా మరుసటి రోజే మంత్రిగా సెంథిల్ బాలాజీ ఉద్వాసన ఉత్తర్వులను.. తమిళనాడు గవర్నర్ RN రవి నిలిపివేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇదే విషయాన్ని సీఎం స్టాలిన్‌కు కూడా గవర్నర్ తెలియజేశారని తెలిపాయి. అటార్నీ జనరల్‌ను సంప్రదించి.. సెంథిల్ బాలాజీ అంశంపై గవర్నర్ న్యాయసలహా తీసుకుంటారని సమాచారం. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు గవర్నర్ తాత్కాలికంగా సెంథిల్ బాలాజీ ఉద్వాసన నిలిపివేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అంతకుముందు గవర్నర్ చర్యపై ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. ఓ మంత్రిని కేబినెట్‌ను తొలగించే అధికారం గవర్నర్‌కు లేదని ఆరోపించారు. ఈ కథనాన్ని పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవీ చదవండి :
గవర్నర్ సంచలన నిర్ణయం.. ఏకపక్షంగా మంత్రి బర్తరఫ్.. ఆ హక్కు లేదన్న సీఎం