Reunited Missing Children With Families
చిన్న చిన్న కారణాలతో చాలా మంది పిల్లలు ఇళ్లను వదిలి వెళ్లిపోతుంటారు. ఇంకొన్ని చోట్ల తల్లిదండ్రుల నుంచి పొరపాటున తప్పిపోయిన వారు ఉంటారు. తిరిగి వెళ్లే దారి తెలియక చాలా మంది అనాథాశ్రమాలు, బాలల గృహాల్లోనే బతుకీడుస్తుంటారు.
ఇలా తప్పిపోయిన సుమారు 600 మంది పిల్లలను వారి తల్లిదండ్రులతో కలిపి నిజజీవిత బజరంగీ భాయిజాన్‌గా మారారు హరియాణా చండీగఢ్‌కు చెందిన ఏఎస్ఐ రాజేశ్ కుమార్.
ఐదేళ్లలో 600 మందికిపైగా పిల్లలు, మహిళలు, వృద్ధులను.. తిరిగి తమ కుటుంబాలతో కలిపారు రాజేశ్.
హరియాణా పోలీస్ శాఖలో మానవ అక్రమ రవాణా నిరోధక విభాగంలో పనిచేసే రాజేశ్.. ఈ గొప్ప పని చేసి ఎందరి నుంచో ప్రశంసలు అందుకుంటున్నారు. ఆయన ప్రయత్నాలను, పిల్లల పట్ల సానుభూతిని చూసి డీజీపీ పీకే అగర్వాల్ కూడా మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా రాజేశ్‌ను ఈటీవీ భారత్ సంప్రదించగా.. ఆయన పలు విషయాలు వెల్లడించారు.
Missing children reunited with their families
2016లో తొలిసారి బాలల గృహానికి వెళ్లగా.. అక్కడ పిల్లలు తమ తల్లిదండ్రులతో కలపాలని అడిగేవారని చెప్పారు రాజేశ్. వాళ్ల బాధలు విని చలించిపోయినట్లు వివరించారు. అప్పుడే వారి కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు.
''మొదట బంగాల్‌కు చెందిన ఓ చిన్నారి తన బాధను చెప్పింది. మాట్లాడేది అర్థం కాకపోయినా.. హిందీ అనువాదంతో తెలుసుకోగలిగా. ఆమె కుటుంబంతో తప్పిపోయిందని తెలిసింది. చాలా శ్రమించి గురుగ్రామ్‌లో ఉన్న తన ఇంటికి చేర్చా. అప్పుడే నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేను.''
- రాజేశ్ కుమార్ ఏఎస్ఐ
ఇంట్లో చిన్న చిన్న గొడవలు జరిగి.. పారిపోయిన వచ్చిన చాలా మందిని తిరిగి ఇళ్లకు చేర్చగలిగానని ఆయన చెప్పారు. ఇలాంటివారు ఎక్కువగా రైల్వే స్టేషన్లలోనే ఉంటారని తెలిపారు. కిడ్నాప్ అయిన పిల్లలను కూడా రక్షించానని చెప్పుకొచ్చారు.
మానసిక స్థితి సరిగా లేని వారు, మాట్లాడలేని వారిని తమ ఇళ్లకు చేర్చేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని.. చాలా విధాలుగా ప్రయత్నించి విజయవంతం అయినట్లు ఈటీవీ భారత్‌కు వెల్లడించారు రాజేశ్.
రోడ్ల వెంట, రైల్వే స్టేషన్లలో ఒంటరిగా పిల్లలు కనిపిస్తే.. హెల్ప్‌లైన్ నెంబర్ 1098కు ఫోన్ చేయాలని, వారిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాలని ప్రజలను అభ్యర్థించారు ఏఎస్ఐ రాజేశ్.
ఇవీ చూడండి: బ్రిటిష్ క్రూరత్వానికి ఆ జైలే నిదర్శనం.. అక్కడ నీళ్లు అడిగితే..