మన జాతీయ గీతానికి అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఈ గేయాన్ని ఆకులపై చెక్కి అరుదైన ఘనత సాధించింది ఓ విద్యార్థిని. సాధారణ రైతు కుమార్తె అయిన ఆమె.. తన అద్భుత కళా నైపుణ్యంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్‌లో చోటు సంపాదించింది. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో సిద్దాపుర్కు చెందిన తృప్తి మంజునాథ ప్రస్తుతం బీఈడీ చదువుతోంది.
తృప్తి మంజునాథ.. వ్యవసాయ కుటుంబానికి చెందిన అమ్మాయి. కార్వారాలోని బాదా శివాజి ఇంజనీరింగ్ కళాశాలలో బీఈడీ రెండో సంవత్సరం చదువుతోంది. ఆమెకు మొదటి నుంచి లీఫ్ ఆర్ట్స్‌పై ప్రత్యేక ఆసక్తి ఉంది. ఈ ఏడాది మే 19న జాతీయ గీతాన్ని ఆకులపై హిందీలో తీర్చిదిద్దింది.
కళల్లో లీఫ్ ఆర్ట్ భిన్నమైందని అంటోంది తృప్తి. ఆకుపైన చిత్రాలను రూపొందించడం ఈ కళ ప్రత్యేకతని చెబుతోంది. ఆకు మిగతా భాగాన్ని అంతా కట్ చేసి, కేవలం కావాల్సిన చిత్రాన్ని తయారుచేయడమే లీఫ్ ఆర్ట్స్. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్‌లో చోటు దక్కడం చాలా ఆనందంగా ఉందని తృప్తి మంజునాథ చెబుతోంది. ప్రస్తుతానికి ఊపాధ్యాయ వృత్తిని ఎంచుకుంది ఈ యువతి. ఎవరైనా లీఫ్ ఆర్ట్ నేర్పించమని వస్తే కచ్చితంగా నేర్పిస్తానని చెబుతోంది.
"అన్ని రకాల కళాకృతులను గీస్తా. పువ్వులు, జంతువులు, జాతీయ గీతం ఇలా రకరకాల చిత్రాలను ఆకులపై తీర్చిదిద్దాను. 8 ఆకులను జాతీయ గీతం రాయడానికి ఉపయోగించా. కరోనా సమయంలోనే లీఫ్ ఆర్ట్‌ను నేర్చుకున్నా. కుటుంబ సభ్యులు నాకు ఎంతగానో సహాయం చేశారు. "
-తృప్తి మంజునాథ
ఇవీ చదవండి: 153 దేశాల వార్తాపత్రికల సేకరణ.. వరించిన గిన్నిస్ వరల్డ్ రికార్డు
ఒకరితో నిశ్చితార్థం.. మరొకరితో ప్రేమ.. ఇద్దరు బిడ్డలు పుట్టాక ఒకే వేదికపై పెళ్లి