The Kerala story controversy : "ది కేరళ స్టోరీ" సినిమాపై కేరళలో వివాదం రేగింది. మతసామరస్యాన్ని దెబ్బతీసే సినిమాను విడుదల చేయొద్దంటూ అధికార పార్టీతోపాటు, పలు విపక్షాలు మండిపడుతున్నాయి. కేరళను మత తీవ్రవాద కేంద్రంగా చిత్రీకరించేలా దుష్ప్రచారం చేస్తున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఘాటుగా స్పందించారు. అలాంటి రాజకీయాలు కేరళలో పనిచేయవని స్పష్టం చేశారు. మతపరమైన విభజన, ద్వేషాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతోనే చిత్రాన్ని తీసినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోందన్నారు. లవ్ జిహాదీ అంశాన్ని దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు, హోం మంత్రిత్వశాఖ కూడా తిరస్కరించినా.. కేరళను ప్రపంచం ముందు అవమానించేందుకే మరోసారి తెరపైకి తీసుకొచ్చారని విజయన్ దుయ్యబట్టారు.
సమాజంలో విషం చిమ్మేందుకు భావప్రకటనా స్వేచ్ఛ ఓ లైసెన్సు కాదంటూ విపక్షాలు మండిపడ్డాయి. సినిమా విడుదలకు అనుమతి ఇవ్వకూడదని కాంగ్రెస్ సహా DYFI, IUML వంటి యువజన సంఘాలు డిమాండ్ చేశాయి. క్రిస్టియన్ అసోసియేషన్ వంటి సంఘాలు మాత్రం "ది కేరళ స్టోరీ" చిత్రం విడుదలకు మద్దతు తెలుపుతున్నాయి. లవ్ జిహాద్‌కు ఛిద్రమైన ఎన్నో కేరళ కుటుంబాల కథను ఈ చిత్రం ఆవిష్కరిస్తుందని పేర్కొన్నాయి.
"ది కేరళ స్టోరీ" చిత్ర పోస్టర్‌ను షేర్ చేసిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్.. 'ఇది మీ కేరళ కథ కావొచ్చు కానీ.. మా కేరళ కథ మాత్రం కాదు' అని చిత్రనిర్మాతలను ఉద్దేశించి ఘాటుగా స్పందించారు. అయితే, చిత్రంపై నిషేధం విధించాలని తాను కోరడం లేదని పేర్కొన్నారు. భావప్రకటనా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తే.. దానికి విలువ ఉండదని హితవు పలికారు. ఈ చిత్రం.. వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉందని చెప్పే హక్కు కేరళ ప్రజలకు ఉందని ట్వీట్ చేశారు.
'నిరూపిస్తే రూ.కోటి మీకే'
కేరళలో కొన్నేళ్లుగా 32 వేల మంది మహిళలు అదృశ్యమైనట్లు వస్తున్న ఆరోపణల ఇతివృత్తంతో దర్శకుడు సుదీప్తోసేన్ చిత్రాన్ని తెరకెక్కించారు. నలుగురు యువతులు మతం మారి.. ఐసిస్ ఉగ్రసంస్థలో చేరిన నేపథ్యంతో రూపొందించారు. వారు భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రకార్యకలాపాల కోసం పనిచేస్తున్నారనే కోణంలో చూపించడం వివాదానికి దారితీసింది. సినిమాలో లవ్‌జిహాదీ ఆరోపణలపై కేరళ స్టేట్ కమిటీ ఆఫ్ ముస్లిం యూత్ లీగ్ సవాలు విసిరింది. ఆరోపణలను ఆధారాలతో సహా నిరూపించిన వ్యక్తికి కోటి రూపాయలు ఇస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించి ప్రతి జిల్లాలో ఆధారాల స్వీకరణ కోసం కలెక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పింది.
సినిమాపై వివాదం నేపథ్యంలో దర్శకుడు సుదీప్తోసేన్ స్పందించారు. ఇప్పుడే సినిమాపై ఒక అభిప్రాయానికి ఎలా వస్తారని ప్రశ్నించారు. 'ముందు సినిమా చూడండి.. ఒకవేళ నచ్చకపోతే అప్పుడు చర్చిద్దాం' అని తెలిపారు. ది కేరళ స్టోరీ చిత్రం కోసం ఏడేళ్లు పనిచేశామని పేర్కొన్నారు. మనమందరం భారతీయులమే అంటూ ట్వీట్ చేశారు. ఈ చిత్రాన్ని ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని రూపొందించామని.. చిత్రంలో ఎక్కడా కూడా ముస్లింలు, కేరళకు వ్యతిరేకంగా లేదని చిత్ర బృందం స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా.. మే 5న మలయాళం, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో చిత్రం విడుదల కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">