అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు లభించిన కారు యజమాని హిరేన్ మన్సుఖ్ మృతి కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దర్యాప్తు కీలక విషయాలు వెల్లడించింది. ఆ కారు యజమాని హిరేన్ కాదని వివరించింది. దాని అసలు యజమాని ఠానేకు చెందిన శ్యామ్ న్యూటన్ అని పేర్కొంది. ఈ మేరకు హిరేన్ మరణించక ముందు పోలీసులకు సమర్పించిన వాంగ్మూలంలో వెల్లడించారని తెలిపింది.
2018 నుంచి ఆ స్కార్పియో వాహనాన్ని మన్సుఖ్ హిరేన్ వినియోగిస్తున్నాడని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. కారు డెకరేషన్ వ్యాపారం చేసే హిరేన్‌కు తన కారును బాగు చేయించాలని శ్యామ్ ఇవ్వగా.. అందుకు రూ.2.8 లక్షల బిల్లును హిరేన్ చేశాడని చెప్పారు. ఆ డబ్బులను యాక్సిస్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు చెక్కుల రూపంలో హిరేన్‌కు శ్యామ్ అందించగా.. అనంతరం ఆ కారును హీరేన్కు అతడు అప్పగించాడని చెప్పారు. అయితే.. ఆ చెక్కులు రెండూ బౌన్స్ అయ్యాయని పేర్కొన్నారు.
సీఎఫ్‌సీకి సచిన్ వాజే
హిరేన్ మృతికేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబయి క్రైమ్ బ్రాంచ్ అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ సచిన్ వాజేను సిటిజెన్ ఫెసిలిటేషన్ సెంటర్(సీఎఫ్‌సీ) విభాగానికి బదిలీ చేశారని ఓ సీనియర్ అధికారి తెలిపారు. హిరేన్ భార్య వాంగ్మూలంలో సచిన్ వాజే పేరు ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వాజేకు తన భర్త గతేడాది నవంబర్‌లో వాహనాన్ని అప్పగించినట్లు హిరేన్ భార్య చెప్పారు. ఫిబ్రవరి మొదటి వారంలో వాజే దాన్ని తిరిగి తన భర్తకు అందించారని వెల్లడించారు.
ఆ ఫోన్ స్వాధీనం..
అంబానీ ఇంటి వద్ద కారు పార్కింగ్ విషయంలో తిహార్ జైలు వేదికగా జైష్-ఉల్-హింద్ అనే ఉగ్రసంస్థ ఓ టెలిగ్రామ్ గ్రూప్‌ను ఉపయోగించినట్లు తేలింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ కేసులో తీహార్ జైలులో ఓ అనుమానితుడి వద్ద నుంచి ఫోన్‌ను దిల్లీ ప్రత్యేక పోలీసు విభాగం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
ఈ ఫోన్ గురించి పూర్తిస్థాయి సమాచారం తెలుసుకునేందుకు ముంబయి పోలీసులు.. ఓ ప్రైవేట్ సైబర్ విభాగ సాయాన్ని తీసుకున్నారు. ఈ కేసుకు జైష్-ఉల్-హింద్ సంస్థకు సంబంధం ఉందని ఆ సంస్థ ముఖ్యనేతలు ఇప్పటికే ప్రకటించారు.
ఇవీ చూడండి: