అయోధ్యలో నిర్మించే రామాలయం కేవలం గుడి మాత్రమే కాదని ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి సంబంధించిన సంపద అని రాష్ట్ర సేవికా సమితి చీఫ్ శాంతక్క అన్నారు. అయోధ్య గుడితో రామారాజ్యం స్థాపితం అవుతుందన్నారు. రామాలయ నిర్మాణం కోసం విరాళాలు సేకరించేందుకు నాగ్‌పుర్‌లో ఆంధ్రా సొసైటీ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు.
రామరాజ్యం అంటే ఆత్మనిర్భర్ భారత్ కలను సాకారం చేసుకోవడమే అని శాంతక్క అన్నారు. కేవలం ఆర్థికంగానే కాకుండా స్వదేశీ పరిజ్ఞానం, ఆలోచనలు, భారతీయ జీవన విధానం వంటి వాటిలో స్వావలంభన సాధిండమని పేర్కొన్నారు. శ్రీరాముని జీవితాన్ని పరిశీలిస్తే దీనిని అర్థం చేసుకోవచ్చన్నారు. అయోధ్య రామాలయాన్ని నిర్మించడం చాలా కీలకమని, లక్షలాది మందిలో ఇది స్ఫూర్తి నింపుతుందని చెప్పారు. గుడి అనగానే ప్రతి ఒక్కరిలో పవిత్ర భావన కలుగుతుందన్నారు. గుడికి వెళ్తే మనసు, శరీరం స్వచ్ఛమవుతుందని పేర్కొన్నారు. రామాలయం దేశ దేవాలయం అవుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రా అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్ మురళీధర్, కార్యదర్శి పీఎస్ఎన్ మూర్తి, పీ ఉషాదేవి, జే నామమణి పాల్గొన్నారు. ఎంఎస్ రాజు హోస్ట్‌గా వ్యవహిరించారు. లక్షీ శాస్త్రీ రామ కీర్తన ఆలపించారు.