దేశంలో తాగునీటి స్వచ్ఛతను పరీక్షించడం, పర్యవేక్షించడం కోసం కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈమేరకు నీటినాణ్యత నిర్వహణ వ్యవస్థ 'డబ్ల్యూఓఎమ్ఐఎస్' పేరుతో ఆన్‌లైన్ వేదికగా ఓ పోర్టల్‌ను ప్రారంభించింది.
ఈ మార్గదర్శకాలు రాష్ట్ర, జిల్లా, బ్లాక్ స్థాయిల్లోని ప్రయోగశాలల్లో నీటి నాణ్యత కోసం చేయాల్సిన విధులను నిర్దేశిస్తున్నాయి. ఈ మార్గదర్శకాల ప్రకారం తాగు నీటి స్వచ్ఛతను 'పీహెచ్' విలువ, నీటిలో కరిగిన ఖనిజ లవణాలు ఇనుము, సల్ఫేట్, ఫ్లోరైడ్, క్షారత, నీటి కాఠిన్యం, నీటిలో ఉన్న కోలీ ఫామ్ బ్యాక్టీరియా ఆధారంగా నిర్ధరిస్తారు.
2018లో కేంద్ర భూగర్భ జల బోర్డు నివేదిక ప్రకారం దాదాపు 20 రాష్ట్రాల్లో తాగు నీరు అందిస్తున్న జలవనరులు ప్రమాదకరమైన ఆర్సెనిక్, క్లోరైడ్, ఫ్లోరైడ్, ఐరన్, నైట్రేట్‌తో కలుషితమైనట్లు తేలింది. ఈ సమస్యను జాతీయ జల్ జీవన్ మిషన్ ద్వారా పరిష్కరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగానే మార్గదర్శకాల జారీతో పాటు నీటి నాణ్యతను పరీక్షించేందుకు 2 వేల 200 ప్రయోగశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఆ నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ!