first night murder : తొలి రాత్రి రక్తస్రావం జరగడంతో ఆ యువకుడు భార్యను అనుమానించాడు. తీరా, అది తన సమస్యే అని తెలిసి ఆపరేషన్‌కు ఒప్పుకున్నాడు. కానీ, యువకుడి తండ్రి అపోహకు గురై వియ్యంకులపై పగ పెంచుకుని వారి హత్యకు పథకం వేశాడు.
చాలా మంది తల్లిదండ్రులు ఒక్కగానొక్క కొడుకు, కూతురు అని గారాబంగా పెంచుకుంటారు. ఇల్లు వదిలి బయటకు వెళ్లనివ్వరు. ఇదే క్రమంలో ఇతర పిల్లలతోనూ కలిసి ఆడుకునేందుకు అంతగా ఒప్పుకోరు. అన్నింటికీ మేం ఉన్నామనుకుంటూనే చాలా విషయాలకు పిల్లల్ని దూరంగా ఉంచుతుంటారు. ఇలాంటి తల్లిదండ్రుల కారణంగా పిల్లలు ఒంటరిగా ఫీలవుతుంటారు. మానసికంగా ఆందోళనకు గురవుతుంటారు. పిల్లల్లో వయస్సు పెరిగేకొద్దీ మానసికంగా, శారీరకంగా ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. అయితే, వాటన్నింటినీ తల్లిదండ్రులతో పంచుకునేందుకు పిల్లలు ఇష్టపడరు. స్నేహితులతో మాత్రమే చర్చిస్తుంటారు.
కుమారైనా, కుమారుడైనా.. వయసుకు తగ్గట్టుగా స్నేహితులతో కలిసి ఉండేలా తల్లిదండ్రులు చూడాలి. వారు దారి తప్పకుండా పర్యవేక్షిస్తూ.. వారిలో మార్పులను మాత్రమే గమనించాలి. చిన్న విషయాలపై ఆందోళనకు గురికాకుండా పలు ఉదంతాలను వివరించి ధైర్యం చెప్పాలి. కానీ, ఓ తండ్రి అనుమానం తల్లీ కూతుళ్లను బలిగొంది. ఎంతో కష్టపడి ఉద్యోగం సాధించిన కొడుకును సైతం హత్యలకు పురికొల్పి కటకటాల వెనక్కి నెట్టింది. కర్నూలు నగరం చెన్నమ్మ సర్కిల్ చింతలముని నగర్లో ఈ నెల 14న జరిగిన హత్య కేసులో పోలీసులు వెల్లడించిన వివరాలు.. షాక్‌కు గురిచేశాయి.
తొలి రాత్రి ఆందోళనకు గురై... చింతలమునినగర్‌కు చెందిన వరప్రసాద్, కృష్ణవేణి దంపతుల కుమారుడు శ్రావణ్ కుమార్‌కు తెలంగాణ రాష్ట్రం వనపర్తికి చెందిన వెంకటేష్, రమాదేవిల కుమార్తె రుక్మిణితో ఈ నెల 1వ తేదీన వివాహమైంది. తొలి రాత్రి తనకు రక్తస్రావం జరగడంతో శ్రావణ్ కుమార్ ఆందోళనకు గురయ్యాడు. తనకు ఆఫీసులో పని ఉందంటూ.. హైదరాబాద్ వెళ్లిపోయాడు. భార్యపై అనుమానం పెంచుకుని ఫోన్లో అసభ్యంగా మాట్లాడేవాడు. వెంకటేశ్వర్లు దంపతులు కుమార్తెతో మాట్లాడగా.. మొదటిరోజు నుంచి భర్త తనతో దూరంగా ఉన్నట్లు చెప్పింది. ఈ విషయమై వారు వియ్యంకుడితో గొడవపడుతూ తమ కుమార్తెకు అన్యాయం జరిగిందని బాధపడ్డారు.
అసలు విషయం తెలిసి... శ్రావణ్ తనకు ఇన్ఫెక్షన్ అయిందని చెప్పడం.. అసలు విషయం తెలిసి రుక్మిణి తల్లిదండ్రులు కూడా ఆవేదన చెందారు. అల్లుడికి నచ్చజెప్పి... తమకు తెలిసిన వైద్యుడిని సంప్రదించి ఆస్పత్రిలో సున్తీ చేయించారు. ఈ విషయం తెలిసిన శ్రావణ్ కుమార్ తండ్రి.. తన కుమారుడికి పిల్లలు పుట్టకుండా అత్తమామలు ఆపరేషన్ చేయించారని అనుమానించాడు. ఇదే సమయంలో తనను తాను అనుమానించుకున్న శ్రావణ్.. 10వ తేదీన ఆత్మహత్యాయత్నం చేశాడు. భార్య, అత్తామామలు తన కుమారుడి పరువు తీయడంతో ఇదంతా జరిగిందని ప్రసాద్ పగ పెంచుకున్నాడు. రుక్మిణి సహా ఆమె తల్లిదండ్రులను చంపాలని పథకం పన్నాడు. ఇదే విషయాన్ని కుమారుడికి చెప్పి... ముందుగానే రెండు కత్తులను కొనుగోలు చేసి ఇంట్లో దాచాడు.
హత్యకు పథకం వేసి... శ్రావణ్ వనపర్తికి వెళ్లి తన భార్య రుక్మిణితో పాటు అత్తామామలు వెంకటేశ్వర్లు, రమాదేవిని కర్నూలు తీసుకొచ్చాడు. వచ్చీ రాగానే ఇరు కుటుంబాల మధ్య మాటామాట పెరిగింది. అత్తామామలతో తీవ్ర వాగ్వాదం జరిగింది. గొడవ తారాస్థాయికి చేరింది. శ్రావణ్.. రుక్మిణిని మొదటి అంతస్తుకు తీసుకెళ్లి కత్తితో పొడిచి చంపాడు. శ్రావణ్ తండ్రి ప్రసాద్... వియ్యపురాలు రమాదేవి, ఆమె భర్త వెంకటేశ్వర్లుపై కత్తితో దాడి చేశాడు. రమాదేవి వరండాలో కుప్పకూలి ప్రాణాలు వదలగా.. అప్పటికే అరుపులు, కేకలు విని స్థానికులు పరుగు పరుగున చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వర్లును ఆసుపత్రికి తరలించారు.
జంట హత్యలకు పాల్పడిన శ్రావణ్ కుటుంబ సభ్యులు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ శంకరయ్య తెలిపారు.
ఇవీ చదవండి :