ACB Officials Inspected TU VC Ravinder's House : తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి (వీసీ) దాచేపల్లి రవీందర్ అవినీతి నిరోధక శాఖ వలలో చిక్కారు. తార్నాకలోని తన నివాసంలో రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లా భీంగల్‌లో పరీక్షా కేంద్రం ఏర్పాటు కోసం దాసరి శంకర్ అనే వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుబడినట్లు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ రెడ్డి తెలిపారు.
రవీందర్ గుప్తాను అరెస్టు చేసి పోలీసులు కోర్టులో హాజరుపరచగా..న్యాయస్థానం ఆయనకు 14రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఏసీబీకి వీసీ రవీందర్ గుప్తా పట్టుబడటంతో వర్శిటీలో సంబరాలు చేసుకున్నారు. విద్యార్థులు, విద్యార్థి నాయకులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది, ఒప్పంద అద్యాపకులు అందరూ టపాసులు కాల్చి సంతోషం వ్యక్తం చెయ్యడం గమనార్హం.
- Telangana University Registrar Yadagiri : టీయూ రిజిస్ట్రార్‌గా యాదగిరి.. వివాదం ముగిసినట్లేనా..!
- Protests in Telangana University : టీయూలో విద్యార్థుల ధర్నా.. వీసీని రౌండప్ చేసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులు
వివాదాల వలయంలో విద్యాలయం: విశ్వవిద్యాలయం అంటే విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాట వేయాలి. నిత్యం కొత్త అంశాలపై బోధన సాగాలి. కానీ తెలంగాణ వర్సిటీ నెలకో వివాదానికి కేంద్ర బిందువుగా నిలుస్తూ వస్తోంది. ఏడాదిగా ఆందోళనలతో అట్టుడికింది. చదువులు సాగక విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 22 నెలల పాటు ఇన్ఛార్జీ, వీసీల పాలనలో నడిచిన వర్సిటీకి శాశ్వత వీసీ వస్తే పరిపాలన, అకడమిక్ వాతావరణం మెరుగు పడుతుందని అంతా ఆశించారు. ఆ దిశగా ఫలితం కనిపించకపోగా.. మరింతగా దిగజారిపోయింది. వర్శిటీ ఏ విధంగా ఉండకూడదో ఉదాహరణగా నిలిచిందంటే ఆశ్చర్యం కలగక మానదు.
ప్రతిసారి ఏదో ఒక వివాదం వర్శిటీలో రాజుకుంటూనే ఉంది. ఈ క్రమంలోనే పాలక మండలి సభ్యులు ప్రభుత్వానికి ఫిర్యాదు చెయ్యడంతో వరుసగా ఈసీ సమావేశాలను నిర్వహించారు. ఇందులో క్రమంగా వీసీ అధికారులకు కత్తెర వేస్తూ తీర్మానాలు చేస్తూ వచ్చింది. మొదట రిజిస్ట్రార్‌ను తొలగించింది. ఆ తరువాత ఆర్థిక అంశాలకు సంబంధించి వీసీని దూరం చేశారు. కనీసం మెయింటనెన్స్‌కు సైతం డబ్బులు రాకుండా పాలకమండలి నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలోనే విజిలెన్స్, ఏసీబీ విచారణకు లేఖ రాయాలని తీర్మానం చేసింది.
చివరకు వర్శిటీని చక్కదిద్దే బాధ్యతను ప్రభుత్వానికి అప్పగిస్తూ పాలకమండని తీర్మానం చేసింది. ఈ క్రమంలోనే గత వారం రోజులుగా విజిలెన్స్ అధికారులు సిబ్బంది వర్శిటీలో తనిఖీలు చేపట్టారు. డబ్బులు ఇచ్చిమంటూ వర్శిటీకి వచ్చిన అనేక మందిని విచారించారు. అలాగే వర్శిటీ ఖాతాల్లో లావాదేవీలను పరిశీలించారు. అన్నింటిపైనా పూర్తి నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈరోజు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఏసీబీ ట్రాప్‌లో పట్టుపడ్డారు.
ఇవీ చూడండి..