Aurangabad Road Accident Today : విధి ఆడే వింత నాటకంలో.. ఎవరి కథ ఎలా ముగిసిపోతుందో చెప్పడం ఈరోజుల్లో చాలా కష్టం. అప్పటివరకు మనతోనే ఉంటూ చిరునవ్వుతో పలకరించిన వ్యక్తి.. మరుసటి రోజు మాయమయ్యాడనే చేదు వార్తను వింటున్నాం. మనిషి చనిపోయాడని పరామర్శకు వెళితే.. చివరికి వారే కాటికి వెళ్లాల్సిన దుస్థితి వచ్చింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు.. పైగా వారందరూ ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు. ఈ విషయం తెలిసి ఆ గ్రామంలోనూ, విన్నవారు విషాదంలో మునిగిపోతున్నారు. అయ్యో పాపం ఎంత కష్టం వచ్చిందే అని కన్నీటి పర్యంతమవుతున్నారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్దిపేట జిల్లా చౌటపల్లి గ్రామస్థులు మరణించారు.
Telangana People Killed Aurangabad : అలాగే తెలంగాణలో గత రెండ్రోజుల క్రితం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు అన్నదమ్ములు మరణించిన ఘటన మరవకముందే ఇప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సోదరులు దుర్మరణం చెందడం తీవ్రంగా కలచివేస్తోంది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేక.. నలుగురు ఒకేసారిఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవడం విధి ఆడిన వింత నాటకమే అని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఔరంగాబాద్‌లో జరిగిన కారు ప్రమాదంలో సిద్దిపేట జిల్లా చౌటపల్లికి చెందిన ఎరుకల కృష్ణ, సంజీవ్, సురేశ్, శ్రీనివాసుగా పోలీసులు గుర్తించారు.
బంధువుల అంత్యక్రియల కోసమని వెళ్లి : గుజరాత్‌కు 1972లో మృతుల తండ్రులు బతుకు తెరువు కోసం వెళ్లారు. అక్కడే పెద్దన్న రాజు ప్లంబింగ్ కాంట్రాక్టర్‌గా, రాములు పవర్ లూమ్ మిషన్స్ పెట్టుకొని జీవనం సాగించేవారు. వారి పిల్లలు కూడా ఇదే వృత్తుల్లో కొనసాగుతున్నారు. ఈనెల 20వ తేదీన బంధువు అంత్యక్రియల కోసం రాష్ట్రానికి వచ్చారు. తిరిగి 23వ తేదీన సూరత్‌కు బయలుదేరారు. ఈ క్రమంలోనే మంగళవారం అర్ధరాత్రి మహారాష్ట్రలోని ఔరంగాబాద్ వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సురేశ్ కుమారుడు భార్గవ్ మాత్రం ప్రాణాలతో బయటపడి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
ఇవీ చదవండి :