Telangana Political Parties MLA Tickets Disputes 2023 : రాష్ట్రంలో ఎన్నికల వేళ.. ప్రతీ రాజకీయ పార్టీకి అసమ్మతి సెగ సర్వసాధారణం. తాజా ఎన్నికల్లోనూ అధికార బీఆర్ఎస్ సహా విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీకు తిరుగుబాటుదారుల బెడద పొంచి ఉంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు దక్కిన పార్టీల అభ్యర్థులు ఉత్సాహంగా నామినేషన్లు వేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మరోవైపు టిక్కెట్ ఆశలు గల్లంతైన ఆశావహుల్లో అసమ్మతి వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో వారి పాత్ర కీలకం కానున్న తరుణంలో ఆయా నేతలను వదులుకోరాదని, విజయానికి వారి సాయం తీసుకోవాలని పార్టీల అధిష్ఠానాలు భావిస్తున్నాయి. వారికి నచ్చజెప్పి టికెట్ ఇచ్చిన అభ్యర్థులతో కలిసి పనిచేయించేలా ఒప్పిస్తున్నాయి.
బాధ పడొద్దు.. మీ కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది : గతంలో లాగా.. సస్పెన్షన్లు, తొలగింపుల వంటి కఠిన చర్యలు తీసుకోకుండా.. హితబోధతో రేపు గెలిస్తే నామినేటెడ్ పదవులతో పాటు ప్రభుత్వంలోనూ ప్రాధాన్యం కల్పిస్తామంటూ శాంతింపజేసేందుకు యత్నిస్తున్నాయి. అనివార్య పరిస్థితుల కారణంగానే మీకు టికెట్ ఇవ్వలేకపోయాం. బాధ పడొద్దు. పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు కృషి చేయండి. మనమే అధికారంలోకి వస్తాం. మీ కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలు వస్తాయి. వాటి ద్వారా ఎమ్మెల్సీలు, రాజ్యసభ ఎంపీల పదవులు పొందొచ్చు. లోక్‌సభ ఎన్నికల్లోనూ తగిన అవకాశమిస్తాం అంటూ అసంతృప్తులను బుజ్జగిస్తున్నాయి.
BRS Leaders Ticket Clashses in Telangana : బీఆర్ఎస్లో సిట్టింగు ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తారనే ప్రచారం ముందునుంచీ జరిగినా.. కొందరినైనా మారుస్తారని ఆ పార్టీ నేతలు ఎంతగానో ఆశించారు. అలాంటి వారికి చుక్కెదురైంది. పలుచోట్ల సిట్టింగు ఎమ్మెల్యేలపై తిరుగుబాటు చేశారు. వారంతా సీనియర్లు, ముఖ్యనేతలు కావడం వల్ల అధిష్ఠానం వారిని దూరం చేసుకోవద్దనే తపనతో బుజ్జగింపులు మొదలుపెట్టింది. షెడ్యూల్ రావడానికి ముందే కొందరికి రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ల పదవులిచ్చింది. ఆ తర్వాత మరికొందరికి హామీలు ఇస్తోంది.
జోరందుకున్న బీఆర్ఎస్ ఇంటింటా ప్రచారం
బీఆర్ఎస్లో అసమ్మతితో పార్టీ నేతలను కాపాడుకోవడం గులాబీ అధిష్టానానికి పెద్ద సవాలుగా మారింది. ఎవరు ఎప్పుడు పార్టీని వీడుతారోననే అయోమయం నేతలను వెంటాడుతోంది. ఇప్పటికే చాలా నియోజకవర్గల్లో లోకల్ లీడర్లు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. మొన్నటి వరకు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సన్నిహితంగా ఉన్నవారు సైతం హస్తం పార్టీ కండువా కప్పుకుంటున్నారు. దీనిని కట్టడి చేసేందుకు బీఆర్ఎస్(BRS Party)అధిష్ఠానం వ్యూహాలు రచిస్తోంది. ఆయా నేతలను బుజ్జగించే పనిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మంత్రి హరీశ్‌రావు రంగంలోకి దిగి భుజానికెత్తుకున్నారు.
ఇప్పటికే జనగామ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఇచ్చి అక్కడి నుంచి పోటీచేస్తున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డితో సయోధ్య కుదిర్చారు. ఘన్‌పూర్ శాసనసభ్యుడు తాటికొండ రాజయ్యకు రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షుడిగా నియమించి అక్కడ అసమ్మతిని చల్లార్చారు. ప్రస్తుతం కడియం శ్రీహరికి రాజయ్య మద్దతుగా నిలుస్తున్నారు. తాండూరు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి టికెట్ ఖరారు కాగానే.. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి సంతృప్తి పరిచారు. నియోజకవర్గాల్లో పార్టీకి దూరమయ్యే అవకాశం ఉన్న నేతలను బుజ్జగించేందుకు బీఆర్ఎస్ ప్రత్యేక చర్యలు చేపట్టింది.
Telangana Congress MLA Candidates Issues : ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌లోనూ అసమ్మతి బెడద తీవ్రస్థాయికి చేరింది. టికెట్ల కోసం పెద్ద సంఖ్యలో పోటీపడగా.. చాలామందికి నిరాశే ఎదురైంది. తీవ్ర అసమ్మతి వ్యక్తమైన పరిస్థితిని గమనించిన అధిష్ఠానం వారితో ప్రత్యేకంగా మాట్లాడింది. పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, దాదాపు వేయికి పైగా పదవులుంటాయని, వాటన్నింటినీ టికెట్ రాని నేతలకే ఇస్తామని నమ్మకంగా చెబుతోంది. కాంగ్రెస్ రెండు విడతల్లో వంద మంది అభ్యర్థులను ఖరారు చేసింది. ఇందులో దాదాపు 30 మంది పక్క పార్టీల నుంచి వచ్చినవారే ఉండటంతో.. ఆయా స్థానాల్లో టికెట్‌పై ఆశ పెట్టుకున్నవారు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. కొంతమంది ఇప్పటికే పార్టీ మారారు. మరికొందరు అనుచరులతో సమావేశాలు పెడుతూ భవిష్యత్ కార్యచరణపై సమాలోచనలు చేస్తున్నారు.
Ticket Clashes in Telangana Congress : అసమ్మతి కాంగ్రెస్ నేతలను బుజ్జగించే పనిని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, జానారెడ్డి నలుగురు సభ్యుల సమన్వయ కమిటీ, కర్ణాటక మంత్రి బోసురాజు తదితరులు అసంతృప్త నేతలతో సమావేశమై సముదాయిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా అసంతృప్తులతో మాట్లాడి భవిష్యత్‌లో తగు ప్రాధాన్యమిస్తామని భరోసా ఇస్తున్నారు. ఎల్బీనగర్ నుంచి మల్రెడ్డి రాంరెడ్డి , హుస్నాబాద్ నుంచి ప్రవీణ్ రెడ్డి, పరకాల నుంచి ఇనుగుల వెంకట్రామిరెడ్డి, వర్ధన్నపేట నుంచి శ్రీనివాస్, మిర్యాలగూడ నుంచి శంకర్ నాయక్, మక్తల్ నుంచి ప్రశాంత్ రెడ్డిలతో మాట్లాడి పార్టీ అభ్యర్థులతో కలిసి పని చేసి వారి విజయానికి సహకరించాలని సూచించారు.
Congress Leaders Ticket Clashses in Telangana : ఎంత చేసినా ఇప్పటికే పార్టీలో గుర్తింపు లేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, నాగర్‌కర్నూల్ అభ్యర్థిత్వం దక్కలేదనే అసంతృప్తితో నాగం జనార్దన్ రెడ్డి, టికెట్లు ఇవ్వలేదనే అసంతృప్తితో మెదక్ డీసీసీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్, మైనార్టీ సెల్ నాయకుడు సోహైల్, మాజీ ఎమ్మెల్యే విష్ణు వర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్, రాగిడి లక్ష్మా రెడ్డి, సోమశేఖర్ రెడ్డి తదితరులు పార్టీని వీడారు. మరింత నష్టం జరగకుండా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం నివారణ చర్యలు చేపట్టింది.
BJP Tickets War in Telangana : బీజేపీ సైతం అసంతృప్తులను మచ్చిక చేసుకునేందుకు పదవుల పంథానే అనుసరిస్తోంది. టికెట్ రాని వారికి కేంద్ర, రాష్ట్రాల స్థాయిలో పదవులిస్తామంటోంది. కేంద్ర ప్రభుత్వంలో పెద్ద సంఖ్యలో పదవులున్నట్లు గుర్తుచేస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లో టికెట్ దక్కని నాయకులు ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూస్తున్నారు. కమలం పార్టీ సైతం చాలా నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తోంది. అందుకే అభ్యర్థులను ఖరారు చేసేందుకు వేచిచూసే ధోరణిలో ఉంది. ఇప్పటికే వరంగల్‌లో టికెట్ ఆశించిన సీనియర్ నేత రాకేశ్ రెడ్డి జాబితాలో పేరు లేకపోవడం చూసి తట్టుకోలేక కాషాయం పార్టీ వీడారు. వేరే పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.
BJP Leaders Ticket Clashses in Telangana : ముథోల్ బీజేపీ టికెట్ ఆశించిన ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి టికెట్ రాకపోవడాన్ని నిరసిస్తూ.. కమలం పార్టీ వీడి గులాబీ పార్టీలో చేరారు. ఖానాపూర్ నియోజకవర్గ బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డ జడ్పీటీసీ సభ్యురాలు భూక్యా జానుబాయి కారెక్కడానికి సిద్ధమయ్యారు. మొత్తంగా ఎన్నికల్లో గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు బలమైన నేతలు చివరి నిమిషంలో చేజారకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ఫిరాయింపులకు అడ్డుకట్ట వేసేందుకు బుజ్జగింపులు చేపడుతున్నాయి.
బీఆర్ఎస్ వైఫల్యాలను వివరిస్తూ ఇంటింటికి కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ప్రచారాలు
ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారిన అసంతృప్తులు - కొనసాగుతున్న బుజ్జగింపులు