KTR Fires on PM Modi on ED Raids : దేశంలో 8 ఏళ్లగా జుమ్లా.. లేకపోతే హమ్లాలే జరుగుతున్నాయని కేటీఆర్ అన్నారు. ప్రతిపక్ష నేతలపై ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ నేతలపై కేంద్ర సంస్థలతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. తమ నాయకులు 12 మందిపై ఈడీని, సీబీఐని పంపించారని.. ఇవి ఈడీ సమన్లు కాదు.. మోదీ సమన్లు అని కేటీఆర్ పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం ఓవైపు ప్రతి పక్షాలపై కేసుల దాడి చేస్తూ.. మరోవైపు ప్రజలపై ధరల దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌతం అదానీ మోదీ బినామీ అని ప్రపంచానికి తెలుసని కేటీఆర్ ఆరోపణలు చేశారు. అదానీ.. మోదీ బినామీ అని చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడని అన్నారు. ముంద్రా పోర్టులో రూ.21 వేల కోట్లు డ్రగ్స్ దొరికినా అదానీపై చర్యలు ఎందుకు లేవని ప్రశ్నించారు.
"సుజనా చౌదరిపై రూ.6వేల కోట్లు కేసు ఏమైంది? 9 ఏళ్ల బీజేపీ పాలనలో 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూల్చారు. సువేందు అధికారిపై కేసులు ఏమయ్యాయి? బీజేపీ నేతలపై పెట్టిన కేసులు ఈడీ, సీబీఐ, ఐటీ చూపెట్టగలవా? కర్ణాటకలో అత్యంత అవినీతి ప్రభుత్వం ఉందని పత్రికలు చెబుతున్నాయి. మోదీ-అదానీ చీకటి స్నేహం గురించి అందరికీ తెలుసు. గుజరాత్‌లో మద్యం తాగి 22 మంది చనిపోయారు...అది లిక్కర్ స్కామ్. అదానీకి అనుగుణంగా కేంద్రం పాలసీ చేసింది...స్కామ్ అంటే అది. అదానీ పోర్ట్‌లో డ్రగ్స్ దొరికితే స్కామ్ కాదట? బీఎల్ సంతోష్‌ను విచారణకు పిలిస్తే దాక్కున్నారు. మా ఎమ్మెల్సీ కవిత చట్టాన్ని గౌరవిస్తారు...విచారణను ఎదుర్కొంటారు. విచారణను ఎదుర్కొనే దమ్ము మాకు ఉంది." - కేటీఆర్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి
డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఒక ఇంజిన్ మోదీ...మరో ఇంజిన్ అదానీ అని కేటీఆర్ అభివర్ణించారు. జీ టూ జీ అంటే గవర్నమెంట్ టూ గవర్నమెంట్ కాదని.. గౌతం అదానీ టూ గొటబాయ డీల్ అని శ్రీలంక ప్రతినిధి అన్నారని గుర్తు చేశారు. కర్ణాటకలో ఎమ్మెల్యే కుమారుడు రూ. కోట్లతో దొరికినా వారిపైకి ఈడీ పోదని అన్నారు. అదానీపై కేసులు ఏమయ్యాయని ప్రశ్నించారు. అదానీపై శ్రీలంక ఆరోపణలపై మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిన్న కవితకు పంపినవి ఈడీ సమన్లు కాదు...మోదీ సమన్లని పేర్కొన్నారు. బీజేపీలో చేరగానే కొంతమందిపై కేసులు మాయమైపోతున్నాయని కేటీఆర్ చెప్పారు.