Telangana HC on Vanama Venkateswara Rao Election : కొత్తగూడెం బీఆర్ఎస్ నాయకుడు వనమా వెంకటేశ్వరరావుకు హైకోర్టులో మళ్లీ చుక్కెదురైంది. కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు ఎన్నికను రద్దు చేస్తూ ఈనెల 25న హైకోర్టు తీర్పు వెలువరించగా.. దీనిని సవాల్ చేస్తూ మళ్లీ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టుకు వెళ్లడం కోసం తీర్పును తాత్కాలికంగా నిలిపివేయాలని ఆయన మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం వనమా పిటిషన్‌ను కొట్టివేసింది. వనమా ఎన్నిక చెల్లదన్న తీర్పును నిలిపి వేసేందుకు హైకోర్టు నిరాకరించింది.
అసలేం జరిగిదంటే : రెండురోజుల క్రితమే కొత్తగూడం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నికను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. ఆయన ఎన్నికను రద్దు చేసిన న్యాయస్థానం.. ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించింది. గత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వనమా వెంకటేశ్వరరావు.. భారత్ రాష్ట్ర సమితి అభ్యర్థిగా జలగం వెంకట్రావు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వనమా గెలుపొందారు.
ఈ క్రమంలోనే 2019లో వనమా వెంకటేశ్వరరావు ఎన్నికను సవాల్ చేస్తూ.. జలగం వెంకట్రావు హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన తప్పుడు సమాచారం ఇచ్చారంటూ పిటిషన్ దాఖలు చేశారు. వనమాను అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. సుదీర్ఘ విచారణ అనంతరం జలగం వెంకట్రావు వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం.. వనమా ఎన్నిక చెల్లదంటూ తీర్పు వెలువరించిన న్యాయస్థానం.. ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చారంటూ.. రూ.5 లక్షల జరిమానాను విధించింది. మరోవైపు ఎన్నికల అనంతరం వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్‌ను వీడి.. బీఆర్ఎస్‌లో చేరారు. ప్రస్తుతం జలగం వెంకట్రావు కూడా అదే పార్టీలో కొనసాగుతున్నారు.
Jalagam Venkatarao MLA Election Controversy : మరోవైపు కొత్తగూడెం ఎమ్మెల్యేగా తనను పరిగణించి ప్రమాణ స్వీకారం చేయించాలని.. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శిని జలగం వెంకట్రావు కోరారు. వనమా వెంకటేశ్వరరావు ఎన్నికను రద్దు చేస్తూ.. జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ హైకోర్టు మంగళవారం ఇచ్చిన తీర్పును ఇరువురికి అందజేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి.. ఆయన ఛాంబర్‌లో వివరాలు సమర్పించినట్లు జలగం తెలిపారు. అసెంబ్లీ కార్యదర్శిని నేరుగా కలిసి ప్రమాణ స్వీకరణ ప్రక్రియ నిర్వహించాలని కోరానని చెప్పారు.
ఖమ్మం జిల్లాలో 2014లో బీఆర్ఎస్ నుంచి తాను ఒక్కడినే గెలిచానని జలగం వెెెంకట్రావు గుర్తుచేశారు. కానీ రాజకీయ కుతంత్రాల వలన 2018లో ఓడిపోయినప్పటికీ.. బీఆర్ఎస్‌లో ఉన్నానని పేర్కొన్నారు. భవిష్యత్‌లోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే కొనసాగుతానని స్పష్టంచేశారు. హైకోర్టు తీర్పు అనంతరం బీఆర్ఎస్ అధిష్టానంతో చర్చించినట్లు జలగం వెంకట్రావు వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి: