Telangana Election Fight in Suryapet Constituency : తెలంగాణ శాసనసభ ఎన్నికల వేడి.. మరో మూడు రోజుల్లో ఎన్నిక పోలింగ్(Telangana Election 2023). ఈ క్రమంలో ప్రధాన పార్టీలు అన్నీ ప్రచారాన్ని ఉద్ధృతంగా చేశాయి. నువ్వానేనా అన్నట్లు ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు పోట్లాడుతున్నారు. అయితే అందరి దృష్టిని ప్రధానంగా ఆకర్షించే పోరు సూర్యాపేటలో జరుగుతుంది. మూడోసారి హ్యాట్రిక్ కోసం బీఆర్‌ఎస్ అభ్యర్థి జగదీశ్‌రెడ్డి చూడగా.. ఆరోసారి గెలిచి చరిత్రను తిరగరాయాలని కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి చూస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలకు కూడలి, రాష్ట్రంలోనే వాణిజ్య పట్టణంగా వెలుగొందుతున్న సూర్యాపేట(Suryapet Election Fight)లో ఈసారి పాగా వేసేదెవరు? ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు.. ముఖ్య నాయకులు కావడం.. ప్రజల్లో మంచి పట్టు ఉన్నవారు కావడం వల్ల పోరు రక్తికడుతోంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొని.. ముందుండి జిల్లాను నడిపించిన జగదీశ్‌రెడ్డి.. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు.
జగదీశ్‌రెడ్డిని గెలిపిస్తే - సూర్యాపేటకు డ్రై పోర్టు ఇప్పించే బాధ్యత నాది : సీఎం కేసీఆర్
హ్యాట్రిక్‌పై కన్నేసిన బీఆర్‌ఎస్ : సంస్థాగతంగా కాంగ్రెస్ బలంగా ఉన్న సూర్యాపేటలో 2014, 2018లో వరుసగా రెండుసార్లు గులాబీ జెండా రెపరెపలాడించారు. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని జగదీశ్‌రెడ్డి(Jagadish Reddy) పట్టుదలతో పనిచేస్తున్నారు. సంక్షేమ ఫలాలు అందరికీ అందించడం, సూర్యాపేటకు మూసీ పీడ నుంచి శాశ్వత విముక్తి.. వైద్యకళాశాల, 300 పడకల ఆస్పత్రి.. జిల్లాకేంద్రంతోపాటు అధిక నిధులు తేవడం కలిసొచ్చే అంశాలు. తన అనుచరులైన స్థిరాస్తి వ్యాపారులకే కాంట్రాక్టులు అప్పగించారన్న అపవాదు.. సమీకృత కలెక్టరేట్ నిర్మాణంలో విమర్శలు.. ద్వితీయ శ్రేణి నేతల నుంచి వ్యతిరేకత కొంత ప్రతికూలం.
"1000 ఎకరాల్లో ఇండ్రస్టియల్ పార్కు తీసుకువచ్చి.. 10,000 మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్లాన్. ఎన్నికల్లో గెలిస్తే మా ప్రధాన ఫోకస్ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే. ప్రజల నుంచి వచ్చిన ఆదరణ చూస్తే మంచి మెజార్టీతో గెలిపిస్తారని భావిస్తున్నాను." -జగదీశ్‌రెడ్డి, బీఆర్‌ఎస్ అభ్యర్థి
Jagadish Reddy vs Ram Reddy Damodar Reddy : కాంగ్రెస్(Congress) అభ్యర్థిగా మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి బరిలో నిలిచారు. తుంగతుర్తి, సూర్యాపేట నుంచి ఐదుసార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. దామోదర్ రెడ్డికి పార్టీ సంప్రదాయ ఓటింగ్ బలంతో పాటు.. అన్ని మండలాల్లోనూ పనిచేసే నాయకులు ఉన్నారు. అందరినీ గుర్తుపెట్టుకుని మాట్లాడేంత చనువు.. సీనియర్ నేతగా, మంత్రిగా అపార అనుభవం దామోదర్‌రెడ్డి సొంతం. పార్టీలో గ్రూప్ తగాదాలు.. వర్గపోరు ప్రతికూల అంశాలు.
" ఏ పార్టీ అయితే బాగా పని చేయగలుగుతుంది. ఏ పార్టీ అయితే ఇచ్చిన మాటను తప్పదు. రాష్ట్రంలో ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా జరుగుతుంది. ప్రజలకు అవసరమైన పనులనే చేస్తాను. జగదీశ్‌రెడ్డి శాసనసభ సభ్యుడిగా ఎన్నిక కాకముందు ఎంత ఆస్తి ఉండేది.. ఇప్పుడెంత ఉంది. అనేది ఆలోచించాలి. తప్పకుండా మంచి మెజార్టీతో గెలుస్తాను." -రాంరెడ్డి దమోదర్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి
బీజేపీ నుంచి బరిలో మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు : గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు మరోసారి బీజేపీ(BJP) నుంచి బరిలో నిలిచారు. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమని ప్రచారం చేస్తున్నారు. సూర్యాపేటలో తప్ప గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి అంతగా పట్టులేదు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యే మళ్లీ హోరాహోరీ పోటీ జరిగేలా కనిపిస్తోంది. బీజేపీ, వట్టే జానయ్య చీల్చే ఓట్లే గెలుపోటముల్లో ప్రధానపాత్ర పోషించే అవకాశాలున్నాయి. సూర్యాపేటలో నువ్వానేనా అన్నట్లుగా అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు.