తెలంగాణలో కొత్తగా నిర్మిస్తున్న సచివాలయం కోసం అనువైన రాళ్లను పరిశీలించేందుకు రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డితో కూడిన రాతి నిపుణుల బృందం రాజస్థాన్‌లోని ధౌల్పుర్కు వెళ్లింది. ఎరుపు, గులాబీ రంగుల్లో ఉండే రాళ్లకు ప్రసిద్ధిగాంచిన సరమతురా డాంగ్ ప్రాంతంలోని గనుల్లో కలియతిరిగింది. బృందంలోని నిపుణులు రాళ్ల నాణ్యతను నిశితంగా పరిశీలించారు. ఈ పర్యటనలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి సుమారు అరడజను గనులను సందర్శించినట్లు అధికారులు తెలిపారు. అక్కడ లభ్యమయ్యే ప్రత్యేక రాళ్ల గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నట్లు వెల్లడించారు.
ఈ క్రమంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి స్థానిక మీడియాతో మాట్లాడారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నిర్మించనున్న సచివాలయానికి కావాల్సిన ఎరుపు, తెలుపు రాళ్లను ధౌల్పుర్ నుంచి కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు.
"పార్లమెంట్ భవన నిర్మాణం ధౌల్పుర్లో లభ్యమయ్యే తెలుపు, ఎరుపు రాళ్లతోనే జరిగిందని తెలుసుకున్నాం. తెలంగాణలో నిర్మించే సచివాలయం కోసం ఈ రాళ్లనే ఉపయోగించాలని నిర్ణయించాం. వాటి కొనుగోలుకు ఇక్కడకు వచ్చాం. ఈ రాళ్ల నాణ్యతకు మరొకటి సాటి రాదు. మా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సచివాలయాన్ని వాస్తు ప్రకారం నిర్మిస్తున్నారు. ఇందుకుగానూ అనేక ఆకృతులను కూడా మా బృందం పరిశీలిస్తోంది."
-ప్రశాంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి
ఇదీ చూడండి: 'రామమందిరాన్ని వ్యతిరేకించేవారు రావణుని పార్టీనే'