Telangana Assembly Election Results 2023 Women MLA Candidates List: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అయితే.. రాష్ట్రంలో ఎంత మంది మహిళలు గెలిచారో మీకు తెలుసా? వాళ్లు ఎవరు..? ఏ పార్టీ నుంచి గెలిచారు? అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
Bharat Rashtra Samithi Winning Women MLA Candidates:
సునీతా లక్ష్మారెడ్డి: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిని సునీతా లక్ష్మారెడ్డి జయకేతనం ఎగురవేశారు. రౌండ్ రౌండ్‌కు ఆధిక్యం మారిన వేళ చివరకు 9వేల 167 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డిపై సునీత ఘన విజయం సాధించారు.
సబితా ఇంద్రారెడ్డి: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం నుంచి ప్రస్తుత విద్యాశాఖ మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థిని సబితా ఇంద్రారెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, బీజేపీ అభ్యర్థి శ్రీరాములు యాదవ్ పై ఆమె విజయం సాధించారు.
లాస్య నందిత: సికింద్రాబాద్ కంటోన్మెంట్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని లాస్య నందిత విజయం సాధించారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన గద్దర్ కూతురు వెన్నెల ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి శ్రీ గణేశ్ రెండో స్థానంలో ఉండగా, వెన్నెల మూడో స్థానానికి పరిమితం అయ్యారు. లాస్య నందిత 17వేల 169 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
కోవ లక్ష్మీ: ఆసిఫాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీరా శ్యామ్, బీజేపీ అభ్యర్థి అజ్మీరా ఆత్మారామ్నాయక్పై గెలుపొందారు.
Congress Winning Women MLA Candidates:
చిట్టెం పర్ణికా రెడ్డి: నారాయణపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి చిట్టెం పర్ణికా రెడ్డి గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఎస్.రాజేందర్ రెడ్డిపై 7వేల 950 ఓట్ల ఆధిక్యతో ఆమె విజయం సాధించారు.
దనసరి అనసూయ (సీతక్క): ములుగులో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సీతక్క విజయం సాధించారు. ఆమె తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి పై సుమారు 28వేల ఓట్ల అధిక్యంతో గెలుపొందారు. దీంతో ములుగులో సీతక్క మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందింది.
కొండా సురేఖ: వరంగల్ తూర్పులో కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ ఎమ్మెల్యేగా గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్‌పై ఆమె విజయం సాధించారు.
మామిడాల యశ్వస్విని రెడ్డి: జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా 26 ఏళ్ల మామిడాల యశస్వినిరెడ్డి అనూహ్యంగా బరిలో నిలిచి గెలుపొందారు. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును ఆమె ఓడించారు.
ఉత్తమ్ పద్మావతి: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి కోదాడ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్‌పై ఘన విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో బొల్లం మల్లయ్య చేతిలో పరాజయం పాలైన ఆమె.. తిరిగి 2023 ఎన్నికల్లో అదే అభ్యర్థిపై విజయం సాధించారు.
మట్టా రాగమయి: సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్యపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మట్టా రాగమయి జయకేతనం ఎగురవేశారు.
Congress, Telangana Election Results 2023 Live : ఖమ్మం ఖిల్లాలో కాంగ్రెస్ జెండా రెపరెపలు