Telangana Assembly Election Results 2023 live News : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దాదాపు కొలిక్కివచ్చాయి. పోస్టల్ బ్యాలెట్లు సహా ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో కాంగ్రెస్ నేతలు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈసారి ఎన్నికల బరిలో దిగిన పలువురు ప్రముఖుల్లో కొందరు తమ విక్టరీని కొనసాగించగా, మరికొందరు అనూహ్యంగా విజయబావుటా ఎగురవేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సీఎం కేసీఆర్ : బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి తన సొంత నియోజకవర్గం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి బరిలో నిలిచారు. అయితే ఈ రెండింట్లో గజ్వేల్‌లో ఎప్పటిలాగే తన హవా కొనసాగించగా, కామారెడ్డిలో మాత్రం తన మేజిక్‌ను రిపీట్ చేయలేకపోయారు. గజ్వేల్‌లో ప్రత్యర్థి ఈటల రాజేందర్‌పై పైచేయి సాధించిన కేసీఆర్, కామారెడ్డిలో మాత్రం తన మార్క్ చూపించలేకపోయారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి విజయం సాధించారు. కేసీఆర్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు.
రేవంత్ రెడ్డి: గత అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి బరిలో దిగి ఓటమి చవిచూసిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఈసారి మాత్రం భారీ మెజార్టీతో గెలుపొందారు. కొడంగల్‌తో పాటు కామారెడ్డిలోనూ పోటీకి దిగిన రేవంత్ అక్కడ మూడో స్థానంలో నిలిచారు. రేవంత్‌కు ప్రత్యర్థులుగా కొడంగల్‌లో బీఆర్ఎస్ తరఫున పట్నం నరేందర్ రెడ్డి, బీజేపీ తరఫున బంతు రమేశ్‌కుమార్ ఉన్నారు. ఇక కామారెడ్డిలో సీఎం కేసీఆర్, బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డిలు బరిలో నిలిచారు.
బండి సంజయ్: బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. అధిష్ఠానం ఆదేశం మేరకు కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన ప్రధాన ప్రత్యర్థి గంగుల కమలాకర్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈసారి కోరుట్ల నుంచి ఎమ్మెల్యేగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ధర్మపురి అర్వింద్కూ చేదు ఫలితమే ఎదురైంది.
హరీశ్‌రావు: సిద్దిపేటలో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆరడుగుల బుల్లెట్ మంత్రి హరీశ్‌రావు తన హిస్టరీని రిపీట్ చేశారు. దాదాపు 50 వేల మెజార్టీతో గెలుపొందారు. ప్రత్యర్థులు పూజల హరికృష్ణ కాంగ్రెస్, డి.శ్రీకాంత్‌రెడ్డి బీజేపీలకు అందనంత లీడ్‌లో దూసుకెళ్లారు.
కేటీఆర్ వన్స్‌మోర్: మంత్రి కేటీఆర్ సైతం మరోమారు గెలిచారు. ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచి 4 సార్లు గెలిచిన కేటీఆర్‌కు ఇది ఐదో విజయం. అయితే ఆధిక్యం మాత్రం గత రెండు ఎన్నికలతో పోలిస్తే ఈసారి చాలా తక్కువగా రావడం గమనార్హం.
మంత్రుల ఓటమి: ధర్మపురి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, నిర్మల్ అభ్యర్థి ఇంద్రకరణ్ రెడ్డి, బాల్కొండ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి, ఖమ్మంలో పువ్వాడ అజయ్ కుమార్, పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు, వనపర్తిలో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిలు ఓటమి పాలయ్యారు.
ఇదిలా ఉండగా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తోంది. అత్యధిక స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ మేజిక్ ఫిగర్ 60 దాటేయగా, 39 సీట్లతో బీఆర్ఎస్ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో బీజేపీ, ఏఐఎంఐఎం ఉన్నాయి.