- " class="align-text-top noRightClick twitterSection" data="">
Telangana Assembly Election Results 2023 Live News : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దాదాపు కొలిక్కి వచ్చాయి. అత్యధిక స్థానాల్లో విజయబావుటా ఎగురవేసిన కాంగ్రెస్ పార్టీ అధికారం ఛేజిక్కుంచుకునే దిశగా దూసుకెళ్తుంది. అదే సమయంలో బీఆర్ఎస్ తరఫున గెలుపు గుర్రాలుగా బరిలోకి దిగిన పలువురు మంత్రులు అనూహ్యంగా ఓటమి పాలయ్యారు.
అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి: రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగారు. కాంగ్రెస్ తరఫున కె.శ్రీహరి రావు, బీజేపీ అభ్యర్థిగా మహేశ్వర్ రెడ్డి ప్రత్యర్థులుగా పోటీలో నిలిచారు. చివరకు బీజేపీ అభ్యర్థి చేతిలో మంత్రి ఓటమి పాలయ్యారు.
సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి: వనపర్తి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి టి.మేఘారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా అనూజ్ఞ రెడ్డి పోటీలో నిలిచారు.
పువ్వాడ అజయ్ కుమార్: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర రావు చేతిలో ఓటమి చవిచూశారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా మిర్యాల రామకృష్ణ, సీపీఎం తరఫున యర్ర శ్రీకాంత్ ఎన్నికల బరిలో నిలిచారు.
ఎర్రబెల్లి దయాకర్‌రావు: జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచిన యశస్విని మామిడాల చేతిలో ఓటమి పాలయ్యారు.
శ్రీనివాస్ గౌడ్: ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఓటమి పాలయ్యారు. మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శ్రీనివాస్ గౌడ్ బరిలో దిగారు. ప్రత్యర్థులుగా కాంగ్రెస్ తరఫున యెర్రం శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ తరఫున ఏపీ మిథున్‌రెడ్డి బరిలో నిలిచారు.
కొప్పుల ఈశ్వర్: జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచిన మంత్రి కొప్పుల ఈశ్వర్ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ చేతిలో ఓడిపోయారు.
ఈ ఆరుగురు మినహా మిగతా 9 మంది మంత్రులు మళ్లీ విజయబావుటా ఎగురవేశారు. గజ్వేల్‌లో కేసీఆర్, సిద్దిపేటలో హరీశ్‌రావు, సిరిసిల్లలో కేటీఆర్, సనత్‌నగర్‌లో తలసాని శ్రీనివాస్ యాదవ్, మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డి, కరీంనగర్ నుంచి గంగుల కమలాకర్, సూర్యాపేటలో జగదీశ్‌రెడ్డి, బాల్కొండ నియోజకవర్గంలో ప్రశాంత్ రెడ్డి, మేడ్చల్‌లో చామకూర మల్లారెడ్డి గెలుపొందారు.