ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ బాలిక హత్య స్థానికంగా సంచలనంగా మారింది. శుక్రవారం మధ్యాహ్నం పొలంలో వరి పంట కోసేందుకు బయటకు వెళ్లిన బాలిక.. గోనె సంచెలో విగతజీవిగా కనిపించింది. దీనిపై స్థానికంగా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రాలు, క్షుద్రపూజల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పలువురు అనుమానిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయ్‌బరేలీ జిల్లాలోని రసూల్‌పుర్ గహర్వారి గ్రామంలో గోనె సంచెలో దొరికిన ఓ మృతిదేహం లభ్యమైంది. గహర్వారికి చెందిన దేశ్‌రాజ్ అనే వ్యక్తి కుమార్తె రూబీ.. వారి పొలంలో వరిపంట కోయడానికి శుక్రవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయలుదేరింది. రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబీకులు చుట్టుపక్కల గాలించారు. అయినా వారికి రూబీ ఆచూకి తెలియలేదు.
అదే రోజు రాత్రి గ్రామానికి చెందిన రామ్‌కుమార్ అనే వ్యక్తికి చెందిన కోళ్లఫారం వద్ద గోనెసంచెలో యువతి మృతదేహం బయటపడింది. సంచిని గమనించిన రామ్‌కుమార్ కుమారుడు.. వెంటనే గ్రామస్థులకు సమాచారం అందించాడు. అక్కడకు చేరుకున్న కుటుంబ సభ్యులు రూబీ మృతిదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కుటుంబ సభ్యులు స్టేషన్లో కేసు నమోదు చేశారు. మృతురాలి కుటుంబ సభ్యులు రామ్‌కుమార్‌పై అనుమానం వ్యక్తం చేయగా అతన్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే క్షుద్రపూజల కోసమే ఈ హత్య చేసి ఉంటారని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
- ఇవీ చదవండి:
- కాళ్లుచేతులు విరిచి, కంట్లో రసాయనాలు పోసి.. యువకుడిని బిచ్చగాడిగా మార్చిన ముఠా
- తల్లి ప్రాణాలను కాపాడబోయి తనయుడు మృతి