Mahanadu program in Rajahmundry: రాజమహేంద్రవరం పసుపుమయంగా మారిపోయింది. భారీ స్వాగత తోరణాలు, తెలుగుదేశం పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో మహానాడు వేదిక కొత్త కళ సంతరించుకుంది. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి వద్ద రెండు రోజుల పాటు నిర్వహించనున్న మహానాడుకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్ శతజయంతి సంవత్సరంతోపాటు.. ఎన్నికల ఏడాదికావడంతో చరిత్రలో నిలిచిపోయేలా ఈసారి మహానాడును తెలుగుదేశం పార్టీ వైభవంగా నిర్వహిస్తోంది. నగరమంతటా పసుపు జెండాలతో కళకళలాడుతోంది.
గతేడాది ఒంగోలులో నిర్వహించిన మహానాడుకు.. అపూర్వ స్పందన లభించడంతోపాటు.. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత సైతం రెట్టింపవ్వడంతో రాజమహేంద్రవరం మహానాడును తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మహానాడు వేదిక నుంచే ఎన్నికల శంఖారావం పూరించనుంది. ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏడాది ముందే మహానాడు లోనే పార్టీ ఎన్నికల ప్రణాళికను సైతం ప్రకటించనుంది. మహిళలు, యువకులు, రైతులకు అధిక ప్రయోజనం కలిగే అంశాలతో తొలి మేనిఫెస్టో విడుదల చేయనుంది.
తొలిరోజు 15 తీర్మానాలు.. నేడు తొలిరోజు ప్రతినిధుల సభ నిర్వహించనుండగా.. రేపు బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. ప్రతినిధుల సభ కోసం 10 ఎకరాల్లో, బహిరంగ సభ కోసం 60 ఎకరాల్లో ప్రాంగణాలు, వేదికలు సిద్ధం చేశారు. 15 వేల మంది పార్టీ ప్రతినిధులకు ఆహ్వానాలు పంపగా.. వీరితోపాటు మరో 35 వేల మంది కార్యకర్తలు రానున్నట్లు సమాచారం. రేపు బహిరంగ సభకు లక్షలాది మంది తరలివచ్చే అవకాశం ఉండటంతో 60 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లు చేశఆరు. చంద్రబాబు, లోకేష్ సహా పార్టీ ముఖ్య నేతలు కూర్చేనేందుకు 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సభా వేదిక నిర్మించారు. తొలిరోజు 15 తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చించనున్నారు.
జగన్ ప్రభుత్వ విధ్వంసకర విధానాలు, సహజవనరుల దోపిడీ, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టటం, టీడీపీ హయాంలోని పథకాలు రద్దు, అక్రమ కేసులు, ధరలు పెరుగుదల తదితర అంశాలపై చర్చించనున్నారు. తెలంగాణకు సంబంధించి కూడా ఆరు తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చించనున్నారు . భారీ బహిరంగ సభకు 15 లక్షల మంది రానున్నట్లు అంచనా వేస్తున్నారు. దీనికోసం సభా ప్రాంగణాన్ని 24 గ్యాలరీలుగా విభజించారు. వేదికపైన ఉన్నవారిని దూరం నుంచి కూడా చూసేందుకు, వారి ప్రసంగాలు వినేందుకు వీలుగా ప్రాంగణమంతటా 50 ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేశారు.
తెలుగుదనం ఉట్టిపడే విధంగా వంటకాలు.. గతంలో మహానాడుకు హాజరైన ప్రతినిధుల వివరాలు మాన్యువల్‌గా నమోదు చేసేవారు. కానీ ఇప్పుడు నమోదు ప్రక్రియంతా డిజిటల్ విధానంలోనే చేపట్టనున్నారు. టీడీపీ సభ్యత్వ కార్డులపైన, మహానాడు కోసం జారీ చేసిన పాస్‌లు, ఆహ్వానపత్రాలపైన కూడా క్యూఆర్ కోడ్‌లు ముద్రించారు. వాటి ద్వారా రెండు సెకన్ల వ్యవధిలోనే ప్రతినిధుల వివరాలన్నీ నమోదుకానున్నాయి. మహానాడుకు వచ్చే వారికి వంటకాలు సిద్ధం చేసేందుకు సుమారు 1,500 మంది రేయింబవళ్లు కృషి చేస్తున్నారు. తెలుగుదనం ఉట్టిపడే విధంగా వంటకాలు సిద్ధం చేయనున్నారు.
ఇవీ చదవండి: