TDP Leaders Condemned YSRCP Attack: అసెంబ్లీలో తెలుగుదేశం ఎమ్మెల్యేలపై దాడి ఘటనపై టీడీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమి, జీవో నెంబర్ వన్, అంగన్వాడిల పోరాటాల నుంచి ప్రజల దృష్టిని మళ్లీంచేందుకే ఈ దాడులకు దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని వైసీపీ నేతలు అంగీకరించలేకపోతున్నారని మండిపడ్డారు.
వైసీపీ తగిన మూల్యం చెల్లించక తప్పదు : టీడీపీ ఎమ్మెల్యేగా సభలో తాను ఉండడం వైసీపీకి నచ్చటం లేదని టీడీపీ శాసనసభ పక్ష విప్ డోలా బాలవీరాంజనేయ స్వామి ఆక్షేపించారు. తనపై సుధాకర్ బాబు, ఎలీజా దాడి చేశారని ఆరోపించారు. దొంగే దొంగ అన్నట్టు.. తానే దాడి చేశానంటున్నారని విమర్శించారు. ఎడిట్ చేయకుండా వీడియో ఫుటేజ్ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. క్షేత్ర స్థాయిలో పట్టు కొల్పోయిన వైసీపీ ఎమ్మెల్యేలు తమపై దాడులు చేస్తున్నారన్న డోలా.. దీనికి వైసీపీ తగిన మూల్యం చెల్లించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. సుధాకర్ బాబు తనపై దాడి చేసినప్పుడు తాను కిందపడిపోయానన్నారు. స్పీకరే ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షి అని.. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారంలో ఉన్నామని.. తానే దాడి చేశానని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ముందస్తు కుట్రలో భాగంగానే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వం కులాలను రెచ్చగొడుతోందన్నారు. ఈ కుట్రలో భాగంగా ఎస్సీ ఎమ్మెల్యేలే తనపైకి వచ్చారన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రశ్నించడం వల్లే తమపై దాడులు చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమే ఈ దాడికి కారణమన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని అసెంబ్లీ రౌడీలు జీర్ణించుకోలేక పోతున్నారని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ మండిపడ్డారు. దళిత శాసన సభ్యుడు డోలా బాలవీరాంజనేయ స్వామిపై దాడి అనైతికమని ఆయన అన్నారు. దళిత ఓట్లతో గెలిచిన జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా దళిత నాయకుడు డోలాపై దాడి చేయింటం సిగ్గు చేటని ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి దిగజారుడు రాజకీయాలకు ఈ చర్య నిదర్శనమని దుయ్యబట్టారు.
అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలపై దాడిని శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ ఖండించారు. చట్టసభల్లో భౌతిక దాడులకు దిగటం అప్రజాస్వామికమన్నారు. ప్రతిపక్ష పార్టీ శాంతియుతంగా నిరసనలు తెలుపుతుంటే వైసీపీ ఎమ్మెల్యేలు దాడికి తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగే దొంగ అన్నట్లుగా టీడీపీ శాసనసభ్యులపై దాడి చేసి తమపై ప్రతిపక్షాలు దాడి చేసినట్లుగా ప్రచారం చేసుకోవడం హేయమైన చర్య అని దుయ్యబట్టారు. అసెంబ్లీని సక్రమంగా నడిపించడంలో అధికార పక్షం పూర్తిగా విఫలమైందని ఎద్దేవా చేశారు. దాడికి పాల్పడిన అధికారపక్షం నేతలపై తక్షణమే చర్యలు తీసుకొని ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓడిపోయే సరికి : అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలపై దాడిని మాజీ మంత్రులు నక్కా ఆనంద బాబు, దేవినేని ఉమామహేశ్వరరావు, కేఎస్ జవహర్, టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఖండించారు. రాక్షస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న వైసీపీ ఇప్పుడు రాక్షస క్రీడతో రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిందని టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఎమ్మెల్యేలపై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. శాసనసభలో వైసీపీ ఎమ్మెల్యేల ప్రవర్తన వారి అహంకారానికి, అసమర్థతకు అద్దం పడుతోందని కన్నా దుయ్యబట్టారు. రాష్ట్ర చరిత్రలోనే అసెంబ్లీలో దాడులు ఎన్నడూ జరగలేదని అన్నారు. మూడు ఎమ్మెల్సీలు ఓడిపోయే సరికి వైసీపీ అసహనంలో ఉందని విమర్శించారు. చట్ట సభల్లోనే దాడులు ప్రజాస్వామ్యానికి ప్రమాదమని టీడీపీ నేతలు మండిపడ్డారు.
ప్రజల దృష్టి మరల్చేందుకే : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక పవిత్రమైన అసెంబ్లీలో వైసీపీ అసెంబ్లీ రౌడీలు చెలరేగుతున్నారని మాజీ మంత్రి కొల్లురవీంద్ర ధ్వజమెత్తారు. దళిత శాసనసభ్యుడు డోలా బాలవీరాంజనేయ స్వామి మీద దాడి హేయమైన చర్య అంటూ మండిపడ్డారు. జీవో నంబర్ వన్ మీద ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న పోరాటం, అంగన్వాడిలు చేస్తున్న పోరాటాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే.. వైసీపీ గుండాలు ఈ నీచానికి దిగారని ఆరోపించారు. నాలుగు దశాబ్దాలుగా శాసన సభ్యులుగా ఉన్న టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరిపై.. అసెంబ్లీ సాక్షిగా వెల్లంపల్లి శ్రీనివాస్ దురుసు ప్రవర్తనను కొల్లురవీంద్ర ఖండించారు.
40 ఏళ్లలో ఇలాంటి పరిణామం చూడలేదు : అసెంబ్లీలో తమపై దాడి జరిగితే, తమనే శాసన సభ నుంచి సస్పెండ్ చేశారని టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి వాపోయారు. 40ఏళ్ల నుంచి చట్టసభల్ని చూస్తున్న తాను, ఏ రోజు ఇలాంటి పరిణామం ఎప్పుడూ చూడలేదని అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం హక్కులన్నీ సభలో వైసీపీ ఎమ్మెల్యేలు హరిస్తున్నారని విమర్శించారు. దుర్మార్గపు ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధమయ్యారన్నారు. స్పీకర్‌కి సభలో ఒక వైపే ప్రేమ ఉంటోందని విమర్శించారు.
సీసీ కేమెరాలు నిలిపి దాడి చేసి ఉంటారు : కౌరవ సభకంటే దారుణంగా అసెంబ్లీ తయారైందని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు దుయ్యబట్టారు. ఇద్దరు ఎమ్మెల్యేలు స్వామి, బుచ్చయ్య చౌదరిలపై మూకుమ్ముడిగా దాడి చేశారని ఆయన మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యేలు మాదకద్రవ్యాలు సేవించి సభకు వచ్చారనే అనుమానం కలుగుతోందన్నారు. ఉదయం 9గంటల నుంచి 10గంటల వరకు మినిట్ టు మినిట్ వీడియోను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కెమెరాలు ఆఫ్ చేసి దాడి చేసి ఉంటారని తమకు అనుమానం ఉందని ఏలూరి సాంబశివరావు ఆరోపించారు.
"మేము ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపితే.. స్పీకర్ నా చేతిని నెట్టివేశారు. ఇంతలో చింతలపూడి శాసన సభ్యులు ఎలిజా, మరో శాసనసభ్యులు సుధాకర్ బాబు నా దగ్గరికి వచ్చి.. నాపై దాడి చేశారు. దొంగే దొంగ అన్న విధంగా వారు పోడియం దగ్గరికి వచ్చి.. నాపై దాడి చేసి, నేను దాడి చేశానని అంటున్నారు. వాళ్ల అధినాయకుడి దృష్టిలో పడాలని నాపై దాడి చేశారు. అదికాక నేను దాడి చేశానని మీడియా ముందుకు వచ్చి ప్రకటనలు చేస్తున్నారు."-డోలా బాలవీరాంజనేయ స్వామి, టీడీపీ శాసనసభ పక్ష విప్
"ప్రజస్వామ్య హక్కులు హరిస్తున్నారు. జీవో నెంబర్ వన్ రద్దు చేయామని ప్రశ్నించటం కోసం మేము వెళ్లాము. సభలో నాలుగు సంవత్సరాలుగా ప్రతి పక్షానికి అవకాశం ఇవ్వటం లేదు. నేను కింద ఉండగా.. స్వామిపై దాడి చేసి తోసేశారు. మా వాళ్లు రక్షణగా వెళ్లారు. ఎల్లంపల్లి నాదగ్గరికి తోసుకుని వచ్చి, ప్లకార్డు తీసుకుని పచ్చి బూతులు మాట్లాడారు. 11మందిమి ఉన్నా మేము ఎలా దాడి చేస్తాము. 150మంది కౌరవ బలం వారిది." -గోరంట్ల బుచ్చయ్య చౌదరి, టీడీపీ సీనియర్ నేత
ఇవీ చదవండి :