TDP Chandrababu Naidu Speech at Allagadda Meeting: ఐదేళ్ల వైసీపీ పాలనలో యువత నిరుద్యోగులుగా మారారని ఆళ్లగడ్డలో నిర్వహించిన 'రా కదలిరా' బహిరంగసభలో చంద్రబాబు విమర్శించారు. తొలుత నంద్యాల జిల్లా ప్రజలకు కొత్త ఏడాది, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, ప్రజల జోరుకు వైసీపీ ప్రభుత్వ పతనం ఖాయం అని ఆశాభావం వ్యక్తం చేశారు. బహిరంగ సభకు వచ్చిన జన సునామీ చూసి తాడేపల్లి పిల్లి వణుకుతుందని ఎద్దేవా చేశారు.
ఒక్కసారే అని కరెంట్ తీగలు పట్టుకుంటే షాక్ తప్పదు: ఈ రాష్ట్రానికి మళ్లీ స్వర్ణయుగం రావాలని పిలుపునిచ్చారు. రాతియుగం వైపు వెళ్తారా, స్వర్ణయుగం కోసం తనతో వస్తారా అని ప్రజలను ప్రశ్నించారు. వైసీపీ పాలనలో రాష్ట్రం ధ్వంసమైందని ద్వజమెత్తారు. అనర్హులను అందలం ఎక్కించి అనేక బాధలు పడుతున్నామన్న చంద్రబాబు, భస్మాసురుడి లాంటి నేతను తెచ్చుకుని కష్టాలు పడుతున్నామని అన్నారు. ఒక్క ఛాన్స్ అంటే అందరూ నమ్మి జగన్‌కు ఓటేశారని, జగన్‌కు తెలిసింది రద్దులు, కూల్చివేతలు, దాడులు, కేసులే అని విమర్శలు గుప్పించారు. ఒక్కసారే అని కరెంట్ తీగలు పట్టుకుంటే షాక్ తప్పదని జగన్‌ని ఉద్దేశించి ఎద్దేవా చేశారు.
నందికొట్కూరుకు రూ.650 కోట్లతో మెగా సీడ్ పార్క్ తేవాలనుకున్నామని, ఎమ్మిగనూరులో టెక్స్‌టైల్ పార్కును అటకెక్కించారని ఆరోపించారు. ఓర్వకల్లుకు 15 నెలల్లో విమానాశ్రయం తెచ్చామన్న చంద్రబాబు, 6 వేల మెగావాట్లతో సోలార్ పార్క్ తెచ్చేందుకు ప్రయత్నించామని తెలిపారు. రాయలసీమలో అన్ని వనరులు ఉన్నాయని, రాయలసీమలో నీటిపారుదల ప్రాజెక్టులు మొదలుపెట్టింది ఎన్టీఆర్ అని కొనియాడారు.
'ఏపీలో ప్రజాస్వామ్యం అపహాస్యం - ఒక్క దొంగ ఓటు ఉన్నా వదిలేది లేదు'
రాయలసీమలో నీరు ఉంటే రతనాలు పండుతాయని, హార్టీకల్చర్ హబ్‌గా చేసేందుకు ప్రయత్నించామని గుర్తు చేశారు. రాయలసీమ వనరులు వాడుకుంటే బయటకు వెళ్లి పనిచేసే అవసరం లేదని, టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చి పనిచేసేలా చేస్తామని పేర్కొన్నారు.
నేను అందరివాడిని: యువత భవిష్యత్తుకు తనది గ్యారంటీ అని, యువత టీడీపీ-జనసేన జెండా పట్టుకుని ప్రజల్లో చైతన్యం తేవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే తనతో కలిసి నడవాలని కోరారు. నేను అందరివాడినని, అదే తన ప్రత్యేకత అని తెలిపారు.
ఐదేళ్లలో మీ జీవితాల్లో ఏదైనా మార్పు వచ్చిందా: నంద్యాల జిల్లాలో రెడ్లకు ఏమైనా న్యాయం జరిగిందా అని ప్రశ్నించిన చంద్రబాబు, వైసీపీ పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు దెబ్బతిన్నారని మండిపడ్డారు. జగన్ మాయ మాటలకు మరోసారి మోసపోయేవారు ఎవరూ లేరని, ఈ ఐదేళ్లలో మీ జీవితాల్లో ఏదైనా మార్పు వచ్చిందా అని అడిగారు.
జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్‌సీ ఏమైంది: ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్‌సీ అన్నారని మరి ఇచ్చారా అంటూ అడిగారు. ఈ ప్రభుత్వ వేధింపులతో అమరరాజా, జాకీ కంపెనీలు పారిపోయాయన్న చంద్రబాబు, తిరుపతిని ఆటోమొబైల్ హబ్ చేయాలని అనేక కంపెనీలు తెచ్చానని పేర్కొన్నారు. కియా పరిశ్రమను తెచ్చిన ఘనత తనదేనన్నారు.
జగనన్న వదిలిన బాణం ఇప్పుడు ఎక్కడ: తోడబుట్టిన చెల్లికి ఆస్తి ఇవ్వకుండా గొడవలు పెట్టుకుంటారని సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. జగనన్న వదిలిన బాణం ఇప్పుడు ఎక్కడ తిరుగుతోందని ఎద్దేవా చేశారు. తిరిగి తమపైనే ఆరోపణలు చేస్తున్నారన్న చంద్రబాబు, వివేకాను హత్య చేసి అనేక డ్రామాలు ఆడారని ఆరోపించారు. వివేకా కుమార్తె, సీబీఐ అధికారులపైనా కేసులు పెట్టారని తెలిపారు. ఆరోపణలు చేసిన రిలయన్స్ కంపెనీ మనిషికే ఎంపీ ఇచ్చారని విమర్శించారు.
రాష్ట్రం బాగుపడాలంటే సైకో జగన్ పోవాలి: చంద్రబాబు
చెత్తపై పన్ను వేసిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచారు: వైసీపీ పాలనలో నిత్యావసరాల ధరలు పెరిగాయా లేదా అని ప్రశ్నించిన చంద్రబాబు, చెత్తపై కూడా పన్ను వేసిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచారని మండిపడ్డారు. మద్యపాన నిషేధం అని మాట తప్పారని, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే చేసేది ఇసుక, అక్రమ మద్యం వ్యాపారం అని ఆరోపించారు. పాణ్యం ఎమ్మెల్యే అవినీతి రారాజుగా మారారన్న చంద్రబాబు, వెంచర్లపై కన్నువేసే వ్యక్తి శ్రీశైలం ఎమ్మెల్యే అన్నారు. డోన్, శ్రీశైలం, పాణ్యం ఎమ్మెల్యేలు అవినీతి చేయలేదా అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వేదావతిని పూర్తి చేసే బాధ్యత తమదని, సిద్ధాపురం ఎత్తిపోతల పథకానికి కరెంట్ బిల్లులు కట్టలేకపోయారని అన్నారు. తాము వచ్చాక కుందూ నదిపై చెక్ డ్యామ్‌లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
స్వర్ణయుగం రావాలంటే రాతియుగం పోవాలి: టీడీపీ వచ్చాక కర్నూలు జిల్లాకు ఆహారశుద్ధి పరిశ్రమలు తెస్తామని, అంగన్వాడీల జీవితాలతో జగన్ ఆటలు ఆడుతున్నారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీలకు న్యాయం చేస్తామన్న చంద్రబాబు, జీతం పెంచమంటే ఎస్మా విధించి ఉద్యోగాలు పోతాయని భయపెడుతున్నారని మండిప్డడారు. తెలుగుజాతి స్వర్ణయుగం కోసం, స్వచ్ఛమైన ప్రజాపాలన కోసం రా కదలి రా అంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు. స్వర్ణయుగం రావాలంటే రాతియుగం పోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు.
TDP Leader Bhuma Akhila Priya Comments: రాష్ట్రంలో రాక్షస పరిపాలన జరుగుతోందని మాజీ మంత్రి అఖిలప్రియ అన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలను ఎలా ఇబ్బంది పెట్టాలో ఆలోచిస్తోందని, సంక్షేమ పథకాలు అమలుకావడం లేదని విమర్శించారు. వైసీపీ పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేలకు ఏమీ పనిలేదని, ప్రతి నియోజకవర్గానికి రౌడీలు, గూండాలు తయారయ్యారని మండిపడ్డారు. ఎవరైనా ప్రశ్నించినా, ధర్నా చేసినా కేసులు పెడుతున్నారన్న అఖిలప్రయ, ఆళ్లగడ్డలో అనేకమంది టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టారని అన్నారు. టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ఎవరినీ వదలను అని అఖిలప్రియ హెచ్చరించారు.
తన కుటుంబసభ్యులపైనా తప్పులు కేసులు పెట్టారని తెలిపిన అఖిలప్రియ, తప్పుడు కేసు పెట్టి తనను జైలులో పెట్టారని ఆవేదన తెలిపారు. చంద్రబాబును అరెస్టు చేసిన నంద్యాల జిల్లా నుంచే వైసీపీ పతనం ప్రారంభమైందని అన్నారు. ఆళ్లగడ్డలో పేదల భూములు లాక్కుంటున్నారన్న అఖిలప్రియ, పొలాలకు నీరు వదలకుండా రైతులను వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీ కెనాల్‌ను పూడ్చివేసి వెంచర్లు వేస్తున్నారని, టీడీపీ ప్రభుత్వం వచ్చాక కేసీ కెనాల్ రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
తిరువూరులో తెలుగుదేశం 'రా కదలిరా' బహిరంగ సభ - భారీగా తరలివచ్చిన ప్రజలు