Chamad Mata sacrifice: ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రా జిల్లా ఖేరాగడ్ తహసీల్దార్ పరిధిలోని బరిగ్వా గ్రామంలో దారుణం జరిగింది. రెండున్నరేళ్ల బాలుడ్ని దేవతకు బలిచ్చాడు ఓ తాంత్రికుడు. చిన్నారి ఇంటి బయట ఆడకుంటుండగా ఎవరూ లేని సమయం చూసి కిడ్నాప్ చేసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. జూన్ 15న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందుతుడు భోళా అలియాస్ హుకం సింగ్‌ను అరెస్టు చేశారు. విచారణలో అతడు నేరం అంగీకరించాడు.
హుకం సింగ్ భూతవైద్యుడిగా పనిచేస్తున్నాడు. అయితే కొద్దిరోజులుగా అతని వద్దకు ఎవరూ వెళ్లడం లేదు. దీంతో చిన్నారిని దేవతకు బలిస్తే మంచి జరుగుతుందని భావించాడు. ఈ సమయంలోనే జూన్ 15న రామ్ అవతార్ కుమారుడు హృతిక్ ఓ బావి సమీపంలో ఆడుకుంటూ కన్పించాడు. ఎవరూ లేరని గమనించి అతడ్ని కిడ్నాప్ చేశాడు హుకం సింగ్. అనంతరం బాలుడ్ని గొంతునులిమి హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని తీసుకెళ్లి చామఢ్ మాతా పాదాల ముందు ఉంచాడు. ఆ మర్నాడు జూన్ 16న వేకువ జామున బాలుడి శవాన్ని ఊరికి దూరంగా ఎండిపోయిన కాలువలో పడేశాడు. అడవి జంతువులు శవాన్ని తింటే ఎలాంటి ఆనవాళ్లు ఉండవనుకున్నాడు.
అయితే బాలుడి శవాన్ని పడేస్తుండగా.. శెరూ అనే వ్యక్తి చూశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని, కుటుంబసభ్యులను రోజుకొకరి చొప్పున దేవతకు బలిస్తానని హుకం సింగ్ శెరూను బెదిరించాడు. కానీ అతడు ధైర్యంగా పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. పోలీసులు వెంటనే తాంత్రికుడ్ని అరెస్టు చేశారు.
జూన్ 15న బాలుడు కన్పించకుండా పోగా.. ఆ మర్నాడే తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని అధికారులు తెలిపారు. విచారణ చేపట్టాక తాంత్రికుడే బాలుడ్ని అపహరించి హత్య చేసినట్లు పని చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఆ వెంటనే అతడ్ని అరెస్టు చేసినట్లు వివరించారు.
ఆస్తి కోసమే..: అయితే హుకం సింగ్ హృతిక్‌ను బలివ్వడం వెనుక మరో కారణం ఉన్నట్లు తెలుస్తోంది. హృతిక్ తండ్రి రామ్ అవతార్‌ను గరీబా అనే వ్యక్తి కొన్నెళ్ల క్రితం దత్తత తీసుకున్నాడు. ఇద్దరి మధ్య గొడవలు రావడం వల్ల తన ఆస్తిని ఇవ్వనని, ఎవరికైనా అమ్మేస్తానని రామ్ అవతార్‌కు గరీబా తేల్చిచెప్పాడు. ఇది విన్న తాంత్రికుడు హుకం సింగ్ ఓ పథకం రచించాడు. కుమారుడు హృతిక్‌ను చంపేస్తే రామ్ అవతార్ బరిగ్వా గ్రామాన్ని వదిలిపెట్టి స్వగ్రామం పీప్లా ఖేడాకు తిరిగి వెళ్లిపోతాడని, ఆ తర్వాత గరీబా ఆస్తిని తక్కువ ధరకే తాను కొనుగోలు చేయవచ్చని అనుకున్నాడు. అందుకే బాలుడ్ని కిడ్నాప్ చేసి చంపి దారుణానికి పాల్పడ్డాడు.
ఇదీ చదవండి: తల నరికి యువకుడి హత్య.. నుపుర్ శర్మకు మద్దతు తెలపడమే కారణం.. మోదీకి వార్నింగ్