దేశంలో రెండోదశ కరోనా విజృంభణ నేపథ్యంలో.. కొవిడ్ రోగులకు ఆక్సిజన్ అనివార్యమైంది. వైరస్ వ్యాప్తి కారణంగా మాస్క్‌లు ధరించి, వదిలిన కార్బన్డయాక్సైడ్నే మరలా పీల్చుకునే పరిస్థితి నెలకొంది. దీన్ని అధిగమించేందుకు కొత్త రకం మాస్క్‌ను కనుగొన్నారు తమిళనాడు మధురైకి చెందిన ఓ విశ్వవిద్యాలయ ఆచార్యులు. నానో టెక్నాలజీతో రూపొందించిన ఈ ఫేస్ మాస్క్.. ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరా చేస్తుంది.
కామరాజ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ అరోకియాదాస్ ఈ కొత్తరకం మాస్క్‌లను ఆవిష్కరించారు. ప్రాణవాయువును అందించే ఈ కొత్త రకం మాస్క్‌తో శ్వాస సంబంధిత సమస్యల్ని సులభంగా అధిగమించవచ్చునని ఆయన చెప్పారు.
"నానో టెక్నాలజీతో రూపొందించిన ఈ మాస్క్ ప్రాణవాయువును ఉత్పత్తి చేసి, సరఫరా చేస్తుంది. ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా కావాల్సిన ఆక్సిజన్ గణాంకాల్ని లెక్కించేందుకు అధునాతన సాంకేతికతను జోడించాం. సెన్సార్ టెక్నాలజీ, నూతన పరిజ్ఞానంతో ఆవిష్కరించిన దీని ధర రూ.500గా ఉంటుంది. వస్త్ర దుకాణాలు, విమానాశ్రయాలు, రైలు కంపార్ట్మెంట్లు వంటి రద్దీ ప్రదేశాల్లో అక్కడి ప్రజలకు సరైన మోతాదులో ఆక్సిజన్ అందించేందుకు ఈ సాంకేతికత ఉపకరిస్తుంది. వీటిని విక్రయించేందుకు పలు ప్రైవేటు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేస్తాం."
- అరోకియాదాస్, కామరాజ్ విశ్వవిద్యాలయ ఆచార్యులు
ఇదీ చదవండి: దేశంలో మరో 3.68 లక్షల మందికి కరోనా