Youth stabbed woman SI: తమిళనాడు, తిరునెల్వేలి జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. సుట్టమల్లి పట్టణ సమీపంలోని పళవూర్లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా ఎస్సైని కత్తితో పొడిచాడు ఓ వ్యక్తి. తీవ్రగాయాలైన ఎస్సైని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దుండగుడిని అరెస్ట్ చేశారు పోలీసులు.
ఇదీ జరిగింది: జిల్లాలోని పళవూర్ గ్రామంలోని ఆలయంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ ఉత్సవాల్లో భాగంగా భద్రతా విధులు నిర్వహిస్తున్నారు మార్గరెట్ థెరిసా అనే మహిళా ఇన్స్పెక్టర్. దుండగుడు అకస్మాత్తుగా అక్కడికి వచ్చి థెరిసా మెడ, గొంతుపై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలైన ఎస్సై అక్కడే కుప్పకూలిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే తిరునెల్వేలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
దాడికి పాల్పడిన దుండగుడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. మహిళా ఎస్సైపై దాడి చేసిన దుండగుడు అదే ప్రాంతానికి చెందిన అరుముగమ్గా గుర్తించారు. ' తనను డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారనే కోపంతోనే మార్గరెట్ థెరిసాపై కత్తితో దాడి చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.' అని పోలీసులు తెలిపారు. అరుముగమ్పై ఐపీసీలోని రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
దుండగుడి దాడిలో గాయపడిన మహిళా ఎస్సై మార్గరెట్ థెరిసాతో ఫోన్లో మాట్లాడారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. థెరిసాను అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఉన్నత స్థాయి వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చూడండి: రూ.100 కోసం కన్నతల్లినే చంపిన కుమారుడు