తమ ఇంటిపై హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఓ రైతు తన కుటుంబసభ్యులతో కలిసి కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగాడు. తమ గోడును ఎంతో మంది అధికారులకు చెప్పుకున్నా వారు వినిపించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా చేతిలో బొమ్మ హెలికాప్టర్ పెట్టుకుని వినూత్నంగా ధర్నాకు దిగారు కుటుంబ సభ్యులు. తమిళనాడులో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది.
తమిళనాడులోని ధర్మపురికి చెందిన గణేశన్ అనే రైతు కుటుంబాన్ని ఆ గ్రామస్థులు గత కొంత కాలంగా వేధిస్తున్నారు. వారి ఇంటికి కూడా వెళ్లనివ్వకుండా చుట్టూ గొడలు కట్టి అడ్డుకుంటున్నారు. నాలుగు నెలలుగా వారందరూ ఓ బంధువు ఇంట్లోనే నివసిస్తున్నారు. ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించినా తమ ఇంటి చుట్టూ ప్రహరీ గోడలు కట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయమై పోలీసులకు పలు మార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. గత్యంతరం లేక ఇంటికి హెలికాప్టర్లోనే వెళ్లడమే సరైన మార్గమని నిర్ణయించుకున్నారు గణేశన్. అలా సోమవారం బొమ్మ హెలికాప్టర్‌తో పాటు వినతి పత్రాన్ని చేత పట్టుకుని కలెక్టరేట్ ఎదురుగా బైఠాయించారు. తమ ఇంటిపై హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేలా చూడండి అంటూ నిరసనలు చేపట్టారు.