మహిళలకు నెలకు వెయ్యి రూపాయల భృతిని ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం. రాష్ట్రంలోని అర్హులైన మహిళలకు వీటిని ఇవ్వనున్నట్లు తెలిపింది. మగలిర్ ఉరిమై (ఉమెన్ రైట్ స్కీమ్) అనే పేరుతో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించింది. తమిళనాడు రాష్ట్ర బడ్జెట్లో భాగంగా.. ఈ కొత్త పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ను.. ఆర్థిక శాఖ మంత్రి పళనివేల్ త్యాగ రాజన్ సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2023 సెప్టెంబర్ 15 నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు పళనివేల్ వెల్లడించారు. ద్రావిడ ఐకాన్, డీఎంకే వ్యవస్థాపకుడు సిఎన్ అన్నాదురై జయంతి సందర్భంగా.. ఆ రోజు నుంచే మహిళలకు నెలకు వెయ్యి రూపాయల భృతిని ఇవ్వనున్నుట్లు పేర్కొన్నారు. ఈ పథకం రాష్ట్రంలోని చాలా మంది మహిళలకు ప్రయోజనాన్ని చేకూరుస్తుందని ఆర్థిక మంత్రి పళనివేల్ తెలిపారు. దీని కోసం 2023-24 బడ్జెట్లో రూ.7,000 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.
50 శాతానికి పైగా మహిళా ఓటర్లు ఉన్న తమిళనాడులో.. ఈ పథకం కచ్చితంగా డీఎంకే పార్టీకి ప్రయోజనం కలిగిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ పార్టీకి భారీగా మహిళ ఓటు బ్యాంకు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎన్నికల సంఘం తాజా గణాంకాల ప్రకారం.. తమిళనాడులో 3,04,89,866 మంది పురుషులు, 3,15,43,286 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
2021 అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ..
ఇంటి యజమాని అయిన మహిళకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తామని.. 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు డీఎంకే ప్రకటించింది. దీన్ని ప్రధాన హామీగా ఇచ్చి ఎలక్షన్లకు వెళ్లింది. కానీ ఇన్ని రోజులైన ఈ పథకాన్ని అమలు చేయకపోవడంపై అధికార పార్టీని.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏఐడీఎమ్కే తరచూ విమర్శిస్తూ వస్తోంది. దీంతో ప్రభుత్వం వీలైనంతా త్వరగా 'మగలిర్ ఉరిమై' (ఉమెన్ రైట్ స్కీమ్) తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే 2023-24 బడ్జెట్లో దీన్ని ప్రకటించింది.
పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలను రూపొందిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ పథకం ద్వారా కుటుంబ పెద్దలుగా ఉండి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకు సహాయం అందించడమే తమ లక్ష్యమని తెలిపింది. ఈ పథకం రాష్ట్రంలోని మహిళల ఆర్థిక సాధికారతకు దోహదపడుతుందని తాము భావిస్తున్నట్లు పేర్కొంది.
ఈ పథకాన్ని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. 2021 ఎన్నికల ముందు అమలు చేశారు. 'లక్ష్మీ భందర్' అనే పేరుతో ఆ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా ఇంటి మహిళ పెద్దకు నెలకు 500 నుంచి వెయ్యి రూపాయలు అందిస్తున్నారు. జనరల్ కేటగిరి మహిళలకు నెలకు రూ. 500, ఎస్సీ/ఎస్టీలకు రూ.1000 అందిస్తున్నారు.