Tailor Stabbing Customer: ప్యాంట్ ఆల్ట్రేషన్ కోసం వెళ్లిన ఓ కస్టమర్‌ను కత్తెరతో పొడిచి గాయపరిచాడు టైలర్. ఈ సంఘటన మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని అంధేరి ప్రాంతంలో మంగళవారం జరిగింది. కేవలం రూ.30 కోసం ఇరువురి మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణ దారితీసింది.
ఇదీ జరిగింది..
ముంబయిలోని అంధేరి ప్రాంతంలో హరీశ్ టకార్ టైలరింగ్ చేస్తున్నాడు. అతని వద్దకు రోహిత్ యాదవ్ అనే వ్యక్తి రెండు రోజుల క్రితం.. తన ప్యాంట్ ఆల్ట్రేషన్ కోసం తీసుకొచ్చాడు. ప్యాంట్‌ను సరి చేసేందుకు రూ.100 అవుతుందని చెప్పగా.. అందుకు ఒప్పుకున్నాడు రోహిత్. ఆ మరుసటి రోజు ప్యాంట్ తీసుకెళ్లేందుకు వచ్చాడు. అయితే.. ముందుగా చెప్పినట్లు రూ.100 కాకుండా మరో రూ.30 అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు టైలర్ హరీశ్. అందుకు రోహిత్ ఒప్పుకోలేదు. తనకు చెప్పింది కేవలం వంద రూపాయలేనని, ఎక్కువ ఇచ్చేది లేదని తేల్చి చెప్పాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. అది ఘర్షణకు దారి తీసింది..
రోహిత్ తన ప్యాంట్ తీసుకుని తిరిగి వెళ్తున్న క్రమంలో.. కత్తెరతో పొడిచాడు టైలర్. దీంతో రోహిత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.
బాధితుని ఫిర్యాదు మేరకు టైలర్ హరీశ్ టాకర్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: 'టీకా వల్లే నా కూతురు మృతి.. వాళ్లు రూ.1000కోట్లు చెల్లించాలి'