పండగ నేపథ్యంలో స్వీట్‌షాపులు కళకళలాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని దుకాణాలు ఖరీదైన మిఠాయిల తయారీతో ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. దీపావళి సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్ ఆగ్రాలోని ఒక స్వీట్ షాప్ ఖరీదైన స్వీట్లను తయారు చేసింది. బంగారు పూతతో పాటు.. డ్రైఫ్రూట్స్‌తో నిండిన ఈ స్వీట్స్‌ను కిలో రూ.30వేలకు విక్రయిస్తోంది. ప్రస్తుతం ఎక్కువమంది ప్రజలు డ్రై ఫ్రూట్స్‌ని ఇష్టపడుతున్నారని.. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ స్వీట్‌ను తయారు చేసినట్లు తాయారీదారులు చెప్పుకొచ్చారు. ఖరీదు ఎక్కువ ఉన్నా కూడా దీపావళి సందర్భంగా వీటికి మంచి డిమాండ్ ఉన్నట్లు చెప్పారు.
మధ్యప్రదేశ్ భూపాల్‌లోని ఓ మిఠాయి కొట్టు కూడా ఇలాంటి పద్ధతినే ఫాలో అయ్యింది. కిలో లడ్డూలను ఏకంగా రూ. 16,800కు విక్రయిస్తోంది. ఇంతకీ ఆ లడ్డూల్లో ఉండే సమ్‌థింగ్ స్పెషల్ ఏంటో తెలుసుకుందామా?
ప్రత్యేకత ఇదే..
సాధారణ లడ్డూలతో పోల్చితే ఇవి కాస్తా భిన్నం. ఇందుకు తగ్గట్టుగానే వాటి రంగును కూడా మార్చారు. రంగు మారేందుకు ఆయుర్వేదం పరంగా మంచిదైన కుంకుమపువ్వును ఇందులో ఉపయోగించారు. వీటి తయారీలో అత్యంత ఖరీదైన పిషోరీ పిస్తాను జోడించినట్లు తయారీదారులు తెలిపారు. వీటికి ప్రత్యేక ఆకర్షణగా.. మేలిమి బంగారు పూతను అద్దినట్లు చెప్పారు. బంగారు పూత రోగనిరోధక శక్తిని పెంచడం వల్ల మరిన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నారు. దీంతో ధరను కూడా అదే స్థాయిలో ఉంచినట్లు చెప్పుకొచ్చారు.
సమ్‌వన్ స్పెషల్ కోసమే..
ఈ స్వీట్స్‌ను అందరూ కొనుగోలు చేయనప్పటికీ.. ప్రత్యేకమైన వ్యక్తులకు ఇచ్చేందుకు కొంతమంది మొగ్గుచూపుతున్నట్లు దుకాణాదారులు చెప్తున్నారు.
గుజరాత్లో లడ్డూ విలువ రూ.25 వేలకుపైనే..
ధనత్రయోదశికి బంగారం కాదు.. బంగారు లడ్డూలు..
దీపావళికి ముందు వచ్చే పర్వదినం ధనత్రయోదశి సందర్భంగా.. దేశవ్యాప్తంగా అనేకచోట్ల బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని అమరావతికి చెందిన ఓ మిఠాయి దుకాణం.. పూర్తిగా బంగారు పూతతో స్వీటును తయారు చేసింది. ఈ లడ్డూ ధర కిలో రూ.11 వేలుగా నిర్ణయించారు.
ఇదీ చూడండి: కళాకారుడి అద్భుతం- గాజు సీసాలో 'దీపావళి' సూక్ష్మ కళాఖండం