ఓ బాధితురాలి ఫిర్యాదు విషయమై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదనందుకు వారం రోజులు రోడ్లు శుభ్రం చేయాలని పోలీసు అధికారిని ఆదేశించింది కర్ణాటక హైకోర్టు.
కలబురగి తాలుకా, మినజ్గి తండాకు చెందిన తారాబాయి(55) అనే మహిళ కుమారుడు సురేష్ అక్టోబర్ 20న అదృశ్యమయ్యాడు. దీంతో ఆమె తన కుమారుడి జాడ వెతికి పెట్టాలంటూ బజార్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అనంతరం కొద్ది రోజులకు తన కుమారుడిని వెతికిపెట్టేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ ఆమె హెబియస్ కార్పస్ పిటిషన్‌ను కోర్టులో దాఖలు చేశారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు సురేష్‌ను నవంబర్ 3న వెతికి పట్టుకుని కోర్టులో ప్రవేశపెట్టారు.
ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు
ఈ క్రమంలో జస్టిస్ ఎస్ సునీల్‌దత్త యాదవ్, జస్టిస్ పీ రామకృష్ణ భట్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును మరోసారి పూర్తిగా పరిశీలించింది. బాధితురాలు ఫిర్యాదు చేసినపుడు ఆమె ఫిర్యాదుపై పోలీసులు తొలుత కనీసం స్టేషన్ డైరీలో గానీ, ఎఫ్‌ఐఆర్ నమోదు గానీ చేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలోనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో విఫలమైన స్టేషన్ హౌజ్ అధికారిని వారం రోజుల పాటు పోలీసు స్టేషన్ ముందు రోడ్లు శుభ్రపరచాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా పోలీస్‌స్టేషన్లలో ఇలాంటి చర్యల విషయంలో కాస్త దృష్టి సారించాలని రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు సూచనలు చేసింది. అదేవిధంగా జీరో ఎఫ్‌ఐఆర్ అంశంపై జిల్లా పోలీసు అధికారులకు వర్క్‌షాప్ నిర్వహించాలని ఎస్పీకి సూచనలు చేసింది.
'క్షమించండి'
ఈ క్రమంలో కోర్టు ఆదేశాలపై ఎస్‌హెచ్‌వో స్పందిస్తూ.. "కోర్టు ఆదేశానుసారం.. స్టేషన్ ముందు రోడ్లు శుభ్రపరచడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. బాధితురాలి ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయనందుకు క్షమాపణలు తెలియజేస్తున్నా. మరోసారి ఈ విధంగా వ్యవహరించనని కోర్టుకు విన్నవిస్తున్నా" అని తెలిపారు.
ఇదీ చూడండి: రాత్రి పూట కర్ఫ్యూ పై కర్ణాటక వెనక్కి