తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో డీఎంకేను విజయపథంలో నడిపించిన స్టాలిన్.. ఈ నెల 7న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు డీఎంకే ఒక ప్రకటనలో వెల్లడించింది. మే 4న సాయంత్రం ఆరు గంటలకు డీఎంకే శాసనసభ్యులు సమావేశమై శాసనసభా పక్ష నేతను ఎన్నుకుంటారని.. డీఎంకే ప్రధాన కార్యదర్శి దురై మురుగన్ ఒక ప్రకటనలో తెలిపారు. చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరుగుతుందని.. ఎమ్మెల్యేలందరూ ఈ సమావేశానికి హాజరుకావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
నిరాడంబరంగా..
కరోనా విజృంభణ నేపథ్యంలో.. ప్రమాణస్వీకార మహోత్సవం నిరాడంబరంగా సాగుతుందని డీఎంకే అధినేత ఎం.కే స్టాలిన్ ఇప్పటికే ప్రకటించారు. మెరీనా బీచ్లో.. తండ్రి కరుణానిధికి పుష్పాంజలి ఘటించారు స్టాలిన్. అనంతరం మీడియాతో మాట్లాడారు. తమపై నమ్మకం ఉంచి ఓటు వేసిన వారిని.. తమ పనితనంతో మెప్పిస్తామన్నారు. అదే సమయంలో తమకు ఓటు వేయని వారు.. ఎందుకు ఓటు వేయలేదని ఆలోచించుకునే విధంగా పాలన సాగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు దశలవారీగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు స్టాలిన్.
234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 6న ఎన్నికలు జరగ్గా.. డీఎంకే కూటమికి తమిళ ప్రజలు పట్టంగట్టారు. 158 సీట్లలో కూటమి అభ్యర్థులు గెలుపొందారు.
ఇవీ చూడండి:-