Swachh Survekshan 2022 : మధ్యప్రదేశ్‌లోని ఇందోర్ వరుసగా ఆరోసారి పరిశుభ్ర నగరంగా నిలిచింది. సూరత్, నవీ ముంబయి తర్వాత స్థానాలు సాధించాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం పరిశుభ్ర నగరాలకు సంబంధించిన వార్షిక సర్వే ఫలితాలను ప్రకటించింది. ఇందోర్, సూరత్ తమ ర్యాంకులను నిలబెట్టుకోగా.. గతేడాది మూడోస్థానంలో నిలిచిన విజయవాడ ర్యాంక్‌ను నవీ ముంబయి దక్కించుకుంది.
స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర తర్వాత స్థానాలు సాధించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. వందకంటే తక్కువ మున్సిపాలిటీలు కలిగిన రాష్ట్రాల జాబితాలో త్రిపుర మొదటి స్థానంలో నిలిచినట్లు పేర్కొన్నాయి. దిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పూరీ పాల్గొన్నారు.
- లక్షలోపు జనాభా కలిగిన నగరాల జాబితాలో మహారాష్ట్రలోని పంచ్‌గని తొలి స్థానంలో నిలిచింది. ఛత్తీస్‌గఢ్‌లోని పటాన్ (ఎన్‌పీ), మహారాష్ట్రలోని కర్హాడ్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
- లక్షకు పైగా జనాభా కలిగిన గంగా నగరాల జాబితాలో హరిద్వార్ తొలి స్థానంలో నిలవగా.. వారణాశి, రిషికేశ్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
- లక్ష కంటే తక్కువ జనాభా కలిగిన గంగా నగరాల జాబితాలో బిజ్నౌర్, కన్నౌజ్, గర్హ్ముక్తేశ్వర్ టాప్-3లో చోటు దక్కించుకున్నాయి.
- మహారాష్ట్రలోని దేవ్‌లాలి అత్యంత పరిశుభ్ర కంటోన్మెంట్ బోర్డుగా తొలి స్థానం దక్కించుకుంది.
- 2016లో కేవలం 73 నగరాలకే పరిమితం అయిన ఈ సర్వేను ఈ ఏడాది 4,354 నగరాలకు విస్తరించారు.
ఇవీ చదవండి: స్కూల్లో పిల్లలకు వ్యాక్సిన్.. 50 మందికి తీవ్ర అస్వస్థత.. ఏం జరిగింది?
కేదార్‌నాథ్‌లో భారీ హిమపాతం.. ఒక్కసారిగా విరిగిపడ్డ మంచు పెళ్లలు!