Surrogacy cheating: సరోగసి ద్వారా పిల్లలను పొందాలని భావించిన దంపతుల ఆలోచనను ఆసరాగా చేసుకుని వారిని మోసం చేశాడు ఓ డాక్టర్. సరోగసి ద్వారానే బిడ్డ పుట్టినట్లు నమ్మించి.. రూ.7 లక్షలు తీసుకున్నాడు. ఈ విషయం పోలీసులకు తెలిసిపోవటం వల్ల డాక్టర్ కుట్ర బయటపడింది. మరో మహిళ బిడ్డను సరోగసి పేరుతో హైదారాబాద్‌కు చెందిన దంపతులకు విక్రయించినట్లు గుర్తించారు.
ఇదీ జరిగింది..
నాగ్‌పుర్‌కు చెందిన ఓ మహిళ ప్రేమ వ్యవహారంతో గర్భం దాల్చింది. గుట్టు చప్పుడు కాకుండా అబార్షన్ చేయించుకునేందుకు డాక్టర్ విలాస్ భోయర్ను సంప్రదించింది. ఈ సమయంలోనే హైదరాబాద్‌కు చెందిన దంపతులు సరోగసి ద్వారా పిల్లలను పొందాలని భావిస్తున్నట్లు తెలుసుకున్నాడు డాక్టర్. దీంతో ఆ డాక్టర్ మెదడులో ఓ దురాలోచన వచ్చింది. వారిని మోసం చేసి డబ్బులు లాగాలని పథకం రచించాడు. బిడ్డను కని తనకు ఇస్తే పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తానని అబార్షన్‌కు వచ్చిన మహిళతో చెప్పాడు. అందుకు ఆమె ఒప్పుకోవటం వల్ల సరోగసి పద్ధతికి ఓ మహిళ సిద్ధంగా ఉందని హైదరాబాద్ దంపతులకు సమాచారం అందించాడు. అందుకు వారి నుంచి రూ.7 లక్షలు తీసుకున్నాడు. సరోగసి ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు నాటకమాడాడు. హైదరాబాద్ వ్యక్తి నుంచి స్పెర్మ్ సేకరించటం వల్ల వారికి ఎలాంటి అనుమానం రాలేదు.
ఈ ఏడాది జనవరి 28న ఆడపిల్లకు జన్మనిచ్చింది మహిళ. సరోగసి పద్ధతిలోనే జరిగినట్లు నకిలీ పత్రాలను సైతం సృష్టించాడు డాక్టర్ విలాస్. సరోగసికి కావాల్సిన అన్నింటిని పూర్తి చేసి హైదరాబాద్ దంపతులకు శిశువును అప్పగించాడు.
నవజాత శిశువును రూ.7 లక్షలకు విక్రయించినట్లు సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డాక్టర్ మోసానికి పాల్పడినట్లు తెలుసుకుని హైదరాబాద్‌కు ఓ బృందాన్ని పంపించారు. శిశువుతో పాటు దంపతులను అరెస్ట్ చేసి నాగ్‌పుర్‌కు తరలించారు. డాక్టర్ విలాస్ భోయర్తో పాటు అతని సహాయకులు రాహుల్ నిమ్జే, నరేశ్ రౌత్‌లను అరెస్ట్ చేశారు.
ఇదీ చూడండి: కాలేజ్‌లో ప్రేమ.. ఉద్యోగంలో సహజీవనం.. పెళ్లి అనేసరికి కులం.. పెట్రోల్ పోసి..