Gyanvapi Case : ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి జ్ఞానవాపి కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మసీదులో కనిపించిన శివలింగ ఆకారానికి కార్బన్ డేటింగ్ పద్ధతిలో వయస్సు నిర్ధరణ చేయాలని మే 12న అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది. శాస్త్రీయ సర్వే అంశాన్ని పక్కనపెట్టి ఈ వ్యవహారంలో చాలా జాగ్రత్తగా నడుచుకోవాల్సిన అవసరం ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ జరిగే వరకు ఈ అంశాన్ని వాయిదా వేస్తున్నట్లు సుప్రీం పేర్కొంది. శివలింగానికి కార్బన్ డేటింగ్ నిర్వహించాలన్న అంశాన్ని చాలా సునిశితంగా పరిశీలించాలని కోర్టు అభిప్రాయపడింది.
శాస్త్రీయ సర్వే చేయవచ్చని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ జ్ఞానవాపి మసీద్ ప్యానెల్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం అలహాబాద్ హైకోర్టు తీర్పుతో విభేదించింది. ఈ వ్యవహారం పూర్తి వివరాలతో తదుపరి విచారణకు హాజరుకావాలని కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సహా హిందూ పిటిషనర్లకు నోటీసులు జారీ చేసింది. అయితే మసీదుకు చెందిన కొందరు అధికారులు మాత్రం ఈ నిర్మాణం 'వాజు ఖానా'లోని ఫౌంటెన్‌లో భాగమని.. నమాజ్‌కు ముందు ఇక్కడ స్నానం చేస్తారని వాదిస్తున్నారు. శివలింగం వయసు నిర్ధరణ సర్వే ప్రతిపాదనను తాత్కాలికంగా వాయిదా వేయాలన్న కోర్టు అభ్యర్థనను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాయి.
సుప్రీం కోర్టు ముందు అదానీ-హిండెన్‌బర్గ్ కేసు రిపోర్ట్!
Adani Hindenburg Report : మరోవైపు అదానీ స్టాక్స్‌లో ర్యాలీ, ధరల తారుమారుకు సంబంధించి నియంత్రణాపరమైన లోపాలు ఉన్నాయని చెప్పలేమని అదానీ-హిండెన్‌బర్గ్ కేసులో సుప్రీం కోర్టు నియమించిన నిపుణుల కమిటీ పేర్కొంది. ఈ మేరకు న్యాయస్థానానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. అయితే, అదానీ గ్రూప్ విషయంలో హిండెన్‌బర్గ్ నివేదికకు ముందు కొన్ని సంస్థలు షార్ట్ పొజిషన్లు తీసుకోవడం, రిపోర్ట్ తర్వాత స్టాక్ ధరలు పతనమైనప్పుడు స్క్వేరింగ్ ఆఫ్ చేశారనడానికి ఆధారాలు ఉన్నాయని తెలిపింది.
విదేశీ సంస్థల నుంచి ధన ప్రవాహానికి సంబంధించిన ఆరోపణలపై విచారణ జరిపిన సెబీ(SEBI) ఏమీ తేల్చలేదని పేర్కొంది. 2020 నుంచి విచారణలో ఉన్న 13 విదేశీ సంస్థల యాజమాన్యాల్ని సెబీ(SEBI) గుర్తించలేకపోయిందని నిపుణుల కమిటీ వివరించింది. అదానీ స్టాక్స్‌కు సంబంధించి సిస్టమ్స్ ద్వారా 849 అనుమానిత అలెర్ట్‌లు జనరేట్ అయ్యాయని తెలిపింది. 849 అనుమానిత అలెర్ట్‌లను స్టాక్ మార్కెట్ పరిశీలించి, సెబీకి 4 నివేదికలు సమర్పించినట్లు నిపుణుల కమిటీ వెల్లడించింది. వాటిలో రెండు హిండెన్‌బర్గ్ నివేదిక విడుదలకు ముందు, మరో రెండు ఆ తర్వాత సమర్పించినట్లు తెలిపింది. అదానీ-హిండెన్‌బర్గ్ కేసుకు సంబంధించి అనేక అంతర్జాతీయ సెక్యూరిటీ సంస్థలను సంప్రదించినట్లు పేర్కొన నిపుణుల కమిటీ అవేవీ కూడా తమతో మాట్లాడేందుకు సముఖత చూపలేదని వెల్లడించింది. వారిలో కొందరు అదానీ గ్రూప్‌తో వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్నట్లు నిపుణుల కమిటీ సుప్రీంకోర్టుకు నివేదించింది.