బాణసంచాలో ప్రమాదకరమైన రసాయనాల వినియోగంపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ఇచ్చిన నివేదిక తీవ్రమైనదని సుప్రీంకోర్టు (Supreme Court on Firecrackers) వ్యాఖ్యానించింది. బేరియం రసాయనంపై నిషేధం ఉన్నప్పటికీ.. తయారీదారులు పెద్ద ఎత్తున దాన్ని కొనుగోలు చేశారని పేర్కొంది. బాణసంచాలో బేరియం/బేరియం సాల్ట్ (Barium in Fireworks) ఉపయోగంపై కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. టపాసుల లేబ్లింగ్ విషయంలోనూ ఉత్తర్వులను ధిక్కరించారని పేర్కొంది.
ఈ అంశంపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఏఎస్ బోపన్నతో కూడిన ధర్మాసనం.. సీజ్ చేసిన వస్తువులలో బేరియం సాల్ట్ వంటి హానికరమైన రసాయనాలను సీబీఐ గుర్తించినట్లు తెలిపింది. హిందుస్థాన్ ఫైర్వర్క్స్, స్టాండర్డ్ ఫైర్వర్క్స్ వంటి తయారీ సంస్థలు బేరియంను భారీగా కొనుగోలు చేసి తమ టపాసులలో ఉపయోగించాయాని పేర్కొంది. ఈ నేపథ్యంలో చెన్నై సీబీఐ జాయింట్ డైరెక్టర్ అందించిన నివేదికపై అభిప్రాయాలు తెలిపేందుకు తయారీదారులకు మరో అవకాశం ఇస్తున్నట్లు తెలిపింది.
"దేశంలో ప్రతిరోజూ ఏదో ఒక వేడుక జరుగుతూనే ఉంటుంది. కానీ ఇతర విషయాలను సైతం పరిగణలోకి తీసుకోవాలి. ప్రజలు ఇబ్బంది పడటాన్ని, కాలుష్యంతో మరణించడాన్ని మేం అనుమతించం.
-సుప్రీంకోర్టు
సీబీఐ నివేదికను సంబంధిత కక్షిదారులందరికీ పంపించాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 6కు వాయిదా వేసింది.
ఇదీ చదవండి: పటాకుల పొగతో సాధారణం కంటే వేగంగా కరోనా వైరస్ వ్యాప్తి