దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తోన్న రైతులను తరలించాలన్న పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దిల్లీ వాసి రిషబ్ శర్మ దాఖలు చేసిన వ్యాజ్యంపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఏ బొబ్డే ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఆందోళన చేస్తోన్న రైతు సంఘాలను పార్టీలుగా ఇంప్లీడ్ చేసేందుకు అనుమతించింది సుప్రీంకోర్టు. ఈ మేరకు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. రేపటిలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
"వివాద పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నాం. రైతు సంఘాలు, కేంద్ర ప్రభుత్వం ప్రతినిధులతో కమిటీ వేస్తాం. రైతుల ఆందోళన జాతీయ సమస్యగా మారే అవకాశం ఉంది. రైతుల ఆందోళనకు సంబంధించిన అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తాం."
- సుప్రీం ధర్మాసనం
దేశ రాజధానిలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడం వల్ల పెద్దఎత్తున రైతులు గుమికూడటం ప్రమాదకరమని పిటిషన్లో పేర్కొన్నారు. రైతులను అనుమతిచ్చిన మైదానానికి తరలించాలని కోరారు.