ED Director Supreme Court : ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చీఫ్ సంజయ్‌కుమార్ మిశ్ర పదవీ కాలం పొడిగింపునకు సర్వోన్నత న్యాయస్థానం అనుమతించింది. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా మిశ్ర పదవీ కాలాన్ని సెప్టెంబర్ 15 వరకు పొడిగించడానికి సుప్రీంకోర్టు ఓకే చెప్పింది. ఈడీ చీఫ్ పదవీ కాలం పొడిగింపు విషయంలో తదుపరి దరఖాస్తును స్వీకరించబోమని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. 'ఆర్థిక చర్యల కార్యదళం' (FATF) సమీక్ష కొనసాగుతున్నందున ఎస్‌కే మిశ్రను అక్టోబరు 15 వరకు కొనసాగించేందుకు అనుమతించాలని కేంద్రం కోరగా.. సెప్టెంబరు 15 వరకే పదవీ కాలం పొడిగింపునకు ఒప్పుకుంది. మరోసారి పొడిగించే ప్రస్తకే లేదని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సంజయ్ కరోల్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
అంతకుముందు.. ఎఫ్‌ఏటీఎఫ్ సమీక్ష నేపథ్యంలో.. ఎస్‌కే మిశ్రను కొనసాగించడం తప్పనిసరని సుప్రీంకు తెలిపింది కేంద్రం. దీనిపై స్పందించిన సుప్రీం.. 'ఈడీ మొత్తం అసమర్థులతో నిండి ఉందా?' అని కేంద్రాన్ని ప్రశ్నించింది. 'ఈడీలో ప్రస్తుత చీఫ్ సంజయ్ కుమార్ తప్ప ఇంకెవరూ సమర్థులు లేరని సందేశం ఇస్తున్నారా?' అని నిలదీసింది. దీనిపై స్పందించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ఎఫ్‌ఏటీఎఫ్ సమీక్ష పూర్తయ్యే వరకు ఎస్‌కే మిశ్రా ఈడీ సంచాలకుడిగా పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అందుకోసం ఆయన్ను మరికొంత కాలం ఆ పదవిలో కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలోనే సెప్టెంబరు 15 వరకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది.
ED Chief Tenure : ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చీఫ్‌గా 2018 నవంబర్‌లో సంజయ్ కుమార్ మిశ్రా నియమితులయ్యారు. రెండేళ్ల తర్వాత ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. మే నెలలో ఆయనకు 60ఏళ్లు పూర్తయ్యాయి. కానీ, 2020 నవంబర్‌లో ఆయన పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం రెండేళ్లు పొడిగించింది. అనంతరం 2022లోనూ మూడోసారి కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, దీనిని సవాలు చేస్తూ కాంగ్రెస్ నేత జయా ఠాకూర్‌తోపాటు పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. సంజయ్ మిశ్రా పదవీ కాలం పొడిగింపు కుదరదని స్పష్టం చేసింది.
ఇవీ చదవండి : మరో ఏడాది పాటు ఈడీ డైరెక్టర్‌గా ఎస్‌కే మిశ్రా
ఈడీ విషయంలో కేంద్రానికి షాక్.. అలా చేయడం అక్రమమన్న సుప్రీంకోర్టు