రిజర్వేషన్లు 50 శాతానికి మించొచ్చా అన్న అంశంపై మంగళవారం కూడా సుప్రీంకోర్టులో వాదనలు సాగాయి. రాజ్యాంగంలోని 102వ సవరణ తర్వాత పార్లమెంటు మాత్రమే సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల (ఎస్‌ఈబీసీ)తో కూడిన ఒకే 'కేంద్రీయ జాబితా'ను సిద్ధం చేయగలదన్న వాదనను ఆమోదిస్తే.. రాష్ట్రాల శాసన సభలకు దీనిపై అధికార పరిధి లేనట్టేనని ధర్మాసనం పేర్కొంది. ఈ లెక్కన మరాఠాలకు కోటాను కల్పిస్తూ మహారాష్ట్ర చేసిన చట్టం చెల్లబోదని తెలిపింది.
జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ హేమంత్ గుప్త, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్‌లతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణను కొనసాగించింది. మరాఠాలకు కోటాను వ్యతిరేకిస్తూ పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు. రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రపతి మాత్రమే ఎస్‌ఈబీసీని నిర్ధారించగలరని పేర్కొన్నారు.
"102వ సవరణ తర్వాత మరాఠాలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు రాజ్యాంగం తలుపులు తెరవని పరిస్థితుల్లో.. రాష్ట్రం సొంతంగా కిటికీని తెరవజాలదు" అని సీనియర్ న్యాయవాది శంకరనారాయణన్ తెలిపారు. రాజ్యాంగ సవరణ తర్వాతే మహారాష్ట్ర ప్రభుత్వం ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసి, మరాఠా వర్గాన్ని ఎస్‌ఈబీసీ జాబితాలో చేర్చిందని చెప్పారు."ఓబీసీలకు రిజర్వేషన్లను విస్తరించే అంశంలో ఏకరూపతను సాధించేందుకు 102వ రాజ్యాంగ సవరణ ప్రయత్నించింది. ఇప్పుడు పార్లమెంటు చేసిన ఎస్‌ఈబీసీ జాబితాకు మాత్రమే చట్టబద్ధత ఉంది" అని పేర్కొన్నారు.
దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. "ఈ వాదనను ఆమోదిస్తే మహారాష్ట్ర చట్టం చెల్లుబాటు కాదు. ఎందుకంటే అది రాష్ట్ర శాసనసభ అధికార పరిధిని దాటిపోతుంది" అని వ్యాఖ్యానించింది.
ఎస్‌ఈబీసీలను గుర్తించడానికి 102సవరణ
అంతకుముందు సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ తన వాదనలను వినిపిస్తూ 102వ రాజ్యాంగ సవరణ తర్వాత ఎస్‌ఈబీసీలను గుర్తించడానికి నిర్దిష్ట ప్రక్రియ ఏర్పడిందని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 342ఎ అధికరణం ప్రకారం గవర్నర్ సలహా మేరకు రాష్ట్రపతి మాత్రమే ఎస్‌ఈబీసీ జాబితాను ఖరారు చేయగలరని చెప్పారు. అయితే రాష్ట్రపతి నోటిఫికేషన్ లేకుండా, ఎన్‌సీబీసీని సంప్రదించకుండా మరాఠాలకు రిజర్వేషన్లు ఇచ్చేశారని తెలిపారు.
ఈ కేసులో వాదనలు బుధవారం కొనసాగుతాయి. సోమవారం జరిగిన విచారణలో 1992 నాటి తీర్పులో ఎస్‌ఈబీసీలకు గరిష్ఠంగా 50 శాతం కోటాను సుప్రీం కోర్టు ఖరారు చేసిందని, ఆ పరిమితిని మార్చడం తగదని పిటిషనర్లు వాదించారు.
ఇదీ చదవండి: వేలంపాట తరహాలో మేనిఫెస్టో వాగ్దానాలు