న్యాయమూర్తుల ఖాళీల భర్తీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ వాయు వేగాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆయన నేతృత్వంలోని కొలీజియం ఇటీవల సుప్రీంకోర్టుకు ఒకేసారి అత్యధికంగా 9 మంది న్యాయమూర్తుల నియామకం చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే ఒరవడిలో దేశంలోని 12 హైకోర్టులకు ఒకేసారి 68 మంది పేర్లను సిఫార్సు చేసి చరిత్ర సృష్టించింది. వీరిలో పది మంది మహిళలు ఉన్నారు.
ఆగస్టు 25, సెప్టెంబరు ఒకటో తేదీల్లో సమావేశమైన జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఎ.ఎం.ఖాన్విల్కర్‌ల నేతృత్వంలోని కొలీజియం మొత్తం 113 మంది పేర్లను పరిశీలించింది. వారిలో 82 మంది న్యాయవాదులు కాగా 31 మంది జ్యుడీషియల్ సర్వీస్ అధికారులు. సునిశిత పరిశీలన అనంతరం 44 మంది న్యాయవాదులు, 24 మంది జ్యుడీషియల్ సర్వీసెస్ అధికారులను హైకోర్టు న్యాయమూర్తి పదవులకు సిఫార్సు చేయాలని కొలీజియం నిర్ణయించింది.
గువాహటి హైకోర్టుకు షెడ్యూల్డ్ తెగలకు చెందిన మహిళా జ్యుడీషియల్ అధికారి మరాలి వంకుంగ్ పేరును కొలీజియం సిఫార్సు చేసింది. ఇందుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే మిజోరం నుంచి వచ్చిన తొలి హైకోర్టు న్యాయమూర్తిగా ఆమె రికార్డులకెక్కుతారు.
ఆగస్టు 17న సుప్రీంకోర్టుకు తొమ్మిది మంది న్యాయమూర్తుల పేర్లను, తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు న్యాయమూర్తుల పేర్లను కొలీజియం సిఫార్సు చేసింది. ఇందులో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామక ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది.
