Sulli Deals Case: వివాదాస్పదమైన 'బుల్లీ బాయ్' తరహా మరో యాప్ సృష్టికర్తగా భావిస్తున్న ఓ వ్యక్తిని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ యాప్‌నకు సంబంధించిన కేసులో తొలి అరెస్టు ఇదేనని పోలీసులు వెల్లడించారు.
ప్రత్యేకంగా ఓ వర్గానికి చెందిన వందలాది మంది మహిళల చిత్రాలను యాప్‌లో వేలానికి ఉంచి వారిని అల్లరిపాలు చేయడమే లక్ష్యంగా దీనిని సృష్టించినట్లు అర్థమవుతోంది. బీసీఏ పూర్తి చేసిన నిందితుడు ట్విట్టర్‌లో ఈ యాప్‌నకు సంబంధించిన గ్రూప్‌లో తానూ సభ్యుడిగా ఉన్నట్లు విచారణలో అగీకరించాడని డీసీపీ కేపీఎస్ మల్హోత్రా వెల్లడించారు.
గిట్‌హబ్‌లో యాప్‌నకు సంబంధించిన కోడ్‌ను తానే రూపొందించినట్లు నిందితుడు అంగీకరించినట్లు మల్హోత్రా తెలిపారు. ట్విట్టర్ గ్రూప్‌లో ఉన్న అందరికీ దాన్ని అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. తర్వాత యాప్‌ను కూడా ట్విట్టర్‌లో షేర్ చేసినట్లు తెలిపారు. సామాజిక మాధ్యమాల నుంచి సేకరించిన చిత్రాలను మార్ఫింగ్ చేసి యాప్‌లో ఉంచేవాళ్లని వెల్లడించారు.
వాస్తవానికి ఈ వ్యవహారం గత ఏడాది వెలుగులోకి వచ్చింది. అప్పుడే కేసు నమోదు చేసినప్పటికీ.. ఇప్పటివరకు ఎలాంటి పురోగతి సాధించలేదు.
మరోవైపు ఈ యాప్ తరహాలోనే ఇటీవల వెలుగులోకి వచ్చిన బుల్లీ బాయ్ యాప్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం మారింది. ఈ నేపథ్యంలో దిల్లీ, ముంబయి పోలీసులు దీన్ని తీవ్రంగా పరిగణించారు. గంటల వ్యవధిలో నిందితులను గుర్తించి విచారణ ప్రారంభించారు. దీంతో ఈ వ్యవహారంపై కూడా దిల్లీ పోలీసులు దృష్టి సారించి.. నిందితుడిని అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: 'ఫేమస్ కావాలనే 'బుల్లీ బాయ్' యాప్‌లో మహిళల వేలం'